కలం, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ఇంటా నిత్యం ఉపయోగించే చౌకైన, పౌష్టికాహార వనరు గుడ్డు. దీనిని శాస్త్రవేత్తలు “ప్రకృతి ప్రసాదించిన మల్టీవిటమిన్ క్యాప్సూల్” అని కూడా పిలుస్తారు. గుడ్లు పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసేవారికి, ఫిట్‌నెస్ లవర్స్‌కు, సామాన్యులకు ఇది ప్రోటీన్‌కు అత్యుత్తమమైన, చౌకైన మూలం. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ నుండి వర్కవుట్ డైట్ వరకు చాలా మంది తమ రోజువారీ ఆహారంలో గుడ్లను (Eating Eggs) ఒక భాగం చేసుకుంటారు. అయితే మనలో చాలామందికి గుడ్డును సరైన పద్ధతిలో ఉలా తినాలో తెలియదు. గుడ్డును మనకు నచ్చినట్టు తినడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుందని మీకు తెలుసా?
పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుడ్లను సరైన పరిమాణంలో, సరైన పద్ధతిలో తీసుకున్నప్పుడు మాత్రమే అవి శరీరానికి పూర్తి ప్రయోజనాలను అందిస్తాయట. లేదంటే ఆ అలవాట్లు గుడ్డులోని పోషక విలువలను తగ్గించడమే కాకుండా జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే గుడ్లు తినేటప్పుడు (Eating Eggs) ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, గుడ్డులో మనకు లభించే పోషకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గుడ్లు.. ఆరోగ్య నిధి
ఒకే ఒక్క గుడ్డులో సుమారు 7 గ్రాముల హై-క్వాలిటీ ప్రోటీన్ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. దీనితో పాటు విటమిన్ A, B, B12, ఫోలేట్, సెలీనియం, బాడీకి అవసరమయ్యే అనేక రకాల సూక్ష్మపోషకాలు ఇందులో సమృద్ధిగా ఉంటాయట. అయితే మనం చేసే కొన్ని పొరపాట్లు ఆ పోషకాలను నాశనం చేస్తాయని చెబుతున్నారు నిపుణులు.
గుడ్లు తినేటప్పుడు మనం చేసే ప్రధాన తప్పులు
1. పచ్చసొనను పూర్తిగా పక్కన పెట్టేయడం
చాలా మంది బరువు పెరుగుతామనే భయంతో లేదా కొలెస్ట్రాల్ వస్తుందని గుడ్డులోని పచ్చసొనను పారేసి, కేవలం తెల్లసొన మాత్రమే తింటారు. ఇలా చేయడం వల్ల గుడ్డులోని పచ్చసొనలో ఉండే ప్రధానమైన సూక్ష్మపోషకాలు, విటమిన్లు మన శరీరానికి అందవు. కాబట్టి శరీరానికి సంపూర్ణ పోషణ అందాలంటే పచ్చసొనను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
2. అతిగా తినడం
కొంత మంది గుడ్లు ఆరోగ్యానికి మంచివి కదా అని రోజుకు 5 నుంచి 6 గుడ్లను తినేస్తుంటారు. ఇలా అస్సలు చేయొద్దంటున్నారు నిపుణులు. దీనివల్ల శరీరంలో అవసరానికి మించి క్యాలరీలు, కొవ్వు పేరుకుపోయి బరువు పెరగడం, గ్యాస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయట.
తెల్లసొన Vs పచ్చసొన: ఏది ఎక్కువ ప్రయోజనకరం..?
గుడ్డులోని రెండు భాగాలకూ వాటి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది
తెల్లసొన: ఇందులో కేవలం ప్యూర్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. ఇది కండరాల నిర్మాణానికి, బరువు నియంత్రణలో ఉంచడానికి అద్భుతంగా తోడ్పడుతుంది. ఇందులో ఫ్యాట్ అస్సలు ఉండదు.
పచ్చసొన: ఇందులో హెల్తీ ఫ్యాట్స్, కీలకమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇది మెదడు పనితీరుకు, హార్మోన్ల సమతుల్యతకు, శరీరానికి సంపూర్ణ శక్తిని ఇవ్వడానికి అవసరం.
ఒక రోజులో ఎన్ని గుడ్లు తినడం సురక్షితం?
ఎలాంటి జబ్బులు లేకుండా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నవారు రోజుకు 1 నుండి 2 సంపూర్ణ గుడ్లను హ్యాపీగా తినవచ్చు. ప్రొటీన్ ఎక్కువ కావాలనుకుంటే తెల్లసొనల సంఖ్యను పెంచుకోవచ్చని తెలిపారు. ఒకవేళ మీరు వెయిట్ లాస్ జర్నీలో ఉన్నా లేదా గుండె జబ్బులు, హై కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నా.. వైద్యుల సలహా మేరకు పచ్చసొనను వారానికి రెండు లేదా మూడు సార్లకే పరిమితం చేసి రోజువారీగా 1 లేదా 2 గుడ్ల తెల్లసొనను మాత్రమే తీసుకోవడం సురక్షితమని సూచిస్తున్నారు నిపుణులు.
Read Also: మహిళలు పిల్లలు కనే మిషిన్లు కాదు.. చంద్రబాబుకు కిరణ్ బేడీ కౌంటర్
Follow Us On: WhatsApp

