కలం, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వీడీ సతీషన్ (VD Satheesan) సోమవారం కేరళ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో నేటి నుంచి కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ప్రభుత్వం అధికారికంగా కొలువుదీరింది. సతీషన్‌తో పాటు యూడీఎఫ్ కూటమికి చెందిన పలువురు కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్ చెన్నితాల, సన్నీ జెసెఫ్, మురళీధరన్ సహా 11 మంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నుంచి పీకే కున్తాలికుట్టితో పాటు ఐదుగురు ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు.
కూటమిలోని ఇతర భాగస్వామ్య పక్షాల నుంచి మోన్స్ జోసెఫ్, షిబు బేబీ జాన్, అనూప్ జాకబ్, సీపీ జాన్‌లు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు అగ్రనేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ కూడా విచ్చేసి నూతన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపారు.

