మ‌హిళ‌లు పిల్ల‌లు క‌నే మిషిన్లు కాదు.. చంద్ర‌బాబుకు కిర‌ణ్ బేడీ కౌంట‌ర్‌

క‌లం, వెబ్‌డెస్క్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌నాభా క్షీణ‌త‌ను అరిక‌ట్టేందుకు ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌నాల‌ని, దానికి త‌గిన‌ట్లు ప్రోత్సాహ‌కాలు అందిస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు (Chandrababu) చేసిన ప్ర‌క‌ట‌న‌పై పుదుచ్చేరి మాజీ లెఫ్ట్‌నెంట్ గ‌వ‌ర్న‌ర్ కిర‌ణ్ బేడీ (Kiran Bedi) ఎక్స్ వేదిక‌గా ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాలు జ‌నాభా పెంపు కోసం మ‌హిళ‌ల‌కు ఇలాంటి ఆర్థిక ప్రోత్సాహ‌కాలు అందించి విఫ‌లం అయ్యాయ‌ని ఆమె గుర్తు చేశారు. చ‌దువుకున్న, ఉద్యోగాలు చేసే మ‌హిళ‌లు ఇలాంటి విధానాల వైపు మొగ్గు చూప‌ర‌ని, అస‌లు మాతృత్వాన్ని ప్ర‌భుత్వం ఒక పాల‌సీగా మార్చ‌కూడ‌ద‌ని ఆమె హిత‌వు ప‌లికారు.

ఏపీకి భ‌విష్య‌త్తులో నైపుణ్యం క‌లిగిన హ్యూమ‌న్ రీసోర్సెస్ కావాలంటే, మ‌హిళ‌ల‌ను ఎక్కువ మంది పిల్ల‌ల‌ను క‌న‌మ‌న‌డం ఒక్క‌టే ప‌రిష్కారం కాద‌ని కిర‌ణ్ బేడీ స్ప‌ష్టం చేశారు. దీనికి భిన్నంగా ఆలోచించి.. తెలుగు భాష‌, నైపుణ్య అభివృద్ధి కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని, దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌తిభావంతుల‌ను ఆక‌ర్షించి ఇక్క‌డ ఉపాధి క‌ల్పించాల‌ని త‌ద్వారా ఉత్పాద‌క‌త‌ను పెంచాల‌ని ఆమె సూచించారు. మ‌హిళ‌లు కేవ‌లం జ‌నాభాను పెంచే సాధ‌నాలు కాద‌ని, మాతృత్వం అనేది వారి వ్య‌క్తిగ‌త ఆశ‌యాలు, ఆరోగ్యం, కెరీర్‌, ఇష్టాల‌పై ఆధార‌ప‌డి ఉండే ఒక స్వ‌తంత్ర నిర్ణ‌య‌మ‌ని ఆమె పేర్కొన్నారు.

రాష్ట్ర జ‌నాభా త‌గ్గుతోంద‌నే కార‌ణంతో మ‌హిళ‌లు త‌మ జీవితంలో అత్యంత కీల‌క‌మైన‌, ఉత్పాద‌క‌మైన స‌మ‌యాన్ని కేవ‌లం ముగ్గురు, న‌లుగురు పిల్ల‌ల్ని క‌ని, వారిని పెంచేందుకే కేటాయించాలా? అని ఆమె ప్ర‌శ్నించారు. మ‌హిళ‌ల కెరీర్‌, వారి ఆశ‌యాలు, సృజ‌నాత్మ‌క‌త‌, వ్య‌క్తిగ‌త జీవితాల సంగ‌తి ఏమిట‌ని నిల‌దీశారు. ఇలాంటి విష‌యాల‌ను ప్ర‌భుత్వం శాసించ‌లేద‌ని, ఈ హ‌క్కు పూర్తిగా మ‌హిళ‌ల‌కే ఉంటుంద‌ని పేర్కొన్నారు. మాతృత్వం అనేది పూర్తిగా మ‌హిళ‌ల శ‌రీరం, జీవితానికి సంబంధించిన వ్య‌క్తిగ‌త నిర్ణ‌య‌మ‌ని, దీన్ని ప్ర‌భుత్వాలు పాల‌సీల ద్వారా నియంత్రించ‌లేవ‌ని ఆమె స్ప‌ష్టం చేశారు. ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల ప‌ట్ల అప్రమ‌త్తంగా ఉండాల‌ని, మ‌హిళ‌లు మేల్కోవాల‌ని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>