కలం, పెగడపల్లి : అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Minister Adluri) అన్నారు. పెగడపల్లి (Pegadapalli) మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొని 605 మంది లబ్ధిదారులకు నూతన చేయూత సామాజిక భద్రత పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద 8 మంది లబ్ధిదారులకు రూ.9,28,000 విలువైన చెక్కులు, ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) కింద 125 మంది లబ్ధిదారులకు రూ.42,38,000 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చేయూత సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ద్వారా అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు తదితరులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తూ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు.
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నామని, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూత అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజా ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

