కలం, తెలంగాణ బ్యూరో: నిత్యం బస్సుల్లో ప్రయాణించే మహిళలకు టీజీఎస్ ఆర్టీసీ (TGSRTC) మరో శుభవార్త అందించింది. మహాలక్ష్మి పథకం కింద పల్లెవెలుగు, ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న ఆర్టీసీ.. తాజాగా ఏసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకూ మంత్లీ సీజన్ టికెట్ల (ఎంఎస్టీ) రూపంలో ప్రత్యేక రాయితీ ప్రకటించింది.
మహిళలపై ఆర్థిక భారం తగ్గించడంతో పాటు రోజూ ప్రజా రవాణాను ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం మహిళల నెలవారీ సీజన్ టికెట్ల ధరను టోల్ ప్లాజా రుసుములతో కలిపి 20 రోజుల ప్రయాణ చార్జీ ఆధారంగా లెక్కిస్తున్నారు. ఇకపై ఈ లెక్కింపును 15 రోజులకు కుదించనున్నారు. దీంతో ఉద్యోగిణులు, విద్యార్థినులు, రోజూ రాకపోకలు సాగించే మహిళలకు టికెట్ ధరలో గణనీయమైన ఆదా కలగనున్నది. ఏసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు ఈ రాయితీ పెద్ద ఊరటనివ్వనున్నది.
అన్ని వర్గాల ప్రయాణికులకు ప్రయోజనం
మహిళలకే కాకుండా అన్ని వర్గాల ప్రయాణికులకు ప్రయోజనం చేకూర్చేలా నెలవారీ సీజన్ టికెట్ల స్కీమ్‌లో 9 అదనపు సౌకర్యాలు, రాయితీలను ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు ఎంఎస్టీ జారీకి ఉన్న దూర పరిమితిని తొలగించింది. నిర్దేశిత రూట్, చార్జీల నిబంధనలకు అనుగుణంగా ఎంత దూరానికైనా సీజన్ టికెట్ పొందే అవకాశం కల్పించింది. సాధారణ ప్రయాణికుల కోసం డీలక్స్ నెలవారీ సీజన్ టికెట్లను అందుబాటులోకి తెచ్చింది.
ఈ టికెట్లతో ఈ-డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించవచ్చు. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, కరీంనగర్ నగరాల్లో ఎంఎస్టీ కలిగిన ప్రయాణికులు ప్రతి ఆదివారం అన్ని కేటగిరీల సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పుష్పక్ ఎయిర్పోర్ట్ లైనర్ బస్సులకు, ప్రభుత్వ సెలవు దినాలకు ఈ సదుపాయం వర్తించదు.
కాంబి టికెట్‌తో మరో బస్సులోనూ జర్నీ
ప్రయాణికుల సౌకర్యార్థం కాంబి టికెట్ విధానాన్ని ప్రవేశపెట్టింది. పల్లెవెలుగు ఎంఎస్టీ కలిగిన వారు ఒక్కో ప్రయాణానికి అదనంగా రూ.20 చెల్లించి ఎక్స్‌ప్రెస్, ఈ-ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఎక్స్‌ప్రెస్ ఎంఎస్టీ హోల్డర్లు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లోనూ ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. పల్లెవెలుగు పాస్‌దారులకు డీలక్స్, ఈ-డీలక్స్ బస్సుల్లో ప్రయాణించే చాన్స్ ఉండదు. నిర్దేశిత రూట్ కాకుండా ఇతర మార్గాల్లో ప్రయాణించే ఎంఎస్టీ హోల్డర్లకు సూపర్ లగ్జరీ, ఆపై స్థాయి బస్సుల బేసిక్ టికెట్ చార్జీపై 10% రాయితీ కల్పించనున్నారు.
పాస్ గడువు పెంపు
2 నెలల సీజన్ టికెట్ కొనుగోలు చేసేవారికి అదనంగా 5 రోజుల వ్యాలిడిటీ ఫ్రీగా లభిస్తుంది. 3 నెలల పాస్ తీసుకునేవారికి 10 రోజుల అదనపు గడువు కల్పించనున్నారు. దీంతో దీర్ఘకాలికంగా బస్సుల్లో ప్రయాణించే వారికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరనున్నది. మహిళలకు ప్రత్యేక రాయితీతో పాటు అన్ని వర్గాల ప్రయాణికులకు అదనపు సౌకర్యాలు కల్పిస్తూ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రజా రవాణా వినియోగాన్ని పెంచే అవకాశం ఉంది. సవరించిన ఎంఎస్టీ విధానాలు శనివారం నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో, ప్రయాణికులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం విజ్ఞప్తి చేసింది.

