కలం, తెలంగాణ బ్యూరో: సోనియా గాంధీ (Sonia Gandhi) ‘ఆత్మకథ’ (బిలాంగింగ్– ఏ జర్నీ ఆఫ్ లవ్) బీఆర్ఎస్ (BRS)కు పొలిటకల్‌గా అడ్వాంటేజ్ కానున్నది. ఆమె తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశాన్ని అందులో ప్రస్తావించకపోవడాన్ని అనుకూలంగా మల్చుకోవాలని ఆ పార్టీ భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చామని ఇంతకాలం చెప్పుకున్నా.. ఇప్పుడు ఆత్మకథలో దాన్ని విస్మరించడంతో ‘తెలంగాణను తెచ్చింది కేసీఆరే’ అని చెప్పుకోడానికి బీఆర్ఎస్కు గ్రౌండ్ ఏర్పడింది. రానున్న రోజుల్లో దీన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా, సెంటిమెంట్ అంశంగా జనంలోకి తీసుకుపోవాలని ఆ పార్టీ భావిస్తున్నది.
‘నిజంగా తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ ఇచ్చినట్లయితే దాన్ని ఆమె తన పుస్తకంలో క్లెయిమ్ చేసుకునేవారు కదా..’ అనే లాజిక్‌ను తెరపైకి తేవాలనుకుంటున్నది. ఇచ్చినట్లు ఆమె చెప్పుకోకపోవడంతో తెచ్చిన వ్యక్తి కేసీఆరే (KCR) అనే వాదన వినిపించాలనుకుంటున్నది. ‘తెలంగాణ తల్లి సోనియాగాంధీ’ అని కాంగ్రెస్ చెప్పుకున్నా.. ‘అదే నిజమైతే ఆత్మకథలో ఆమె స్వయంగా చెప్పుకునేవారు కదా’ అని కౌంటర్ ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నది. రాష్ట్రం ఏర్పడిన పుష్కర కాలం తర్వాత తెలంగాణ ఇచ్చిందెవరు? తెచ్చిందెవరు? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
‘తెలంగాణ తల్లి’గా ప్రశంసలు
సోనియాగాంధీని ‘తెలంగాణ తల్లి’గా కాంగ్రెస్ నేతలు కీర్తిస్తున్నారు. ఒక రాష్ట్రంలో పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారినా.. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రాన్ని ఇచ్చారని అనేక సందర్భాల్లో గుర్తుచేశారు. మరోవైపు ‘ఆమె దయతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది’ అని కేసీఆర్ సైతం అసెంబ్లీ వేదికగానే ప్రకటించారు. రాష్ట్ర ఏర్పాటు ఒక చారిత్రక ఘట్టమైనా.. 1,200 మంది త్యాగాల పునాదుల మీద ఏర్పడినా.. సోనియాగాంధీ తన ‘ఆత్మకథ’లో ప్రస్తావించకపోవడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు.
ప్రజల ఆకాంక్షలు, ఉద్యమ స్ఫూర్తిని ఆమె విస్మరించారని విమర్శించారు. వ్యక్తిగత అంశాలతో పాటు పలు రాజకీయ విషయాలనూ ప్రస్తావించి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును పొందుపర్చకపోవడం వివాదానికి దారితీసింది. రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందినప్పుడు, లాంఛనంగా 2014 జూన్ 2న ఆవిర్భవించినప్పుడు, మరికొన్ని సందర్భాల్లో రాష్ట్ర ప్రజలకు సోనియాగాంధీ స్వయంగా వీడియో సందేశాలను పంపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 2023 నవంబర్ చివరి వారంలోనూ కాంగ్రెస్‌ను ఆదరించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఇన్ని సందర్భాలు ఉన్నా ‘ఆత్మకథ’లో ప్రస్తావన లేకపోవడమే ఇప్పుడు బీఆర్ఎస్కు కలిసొస్తున్నది.
కేంద్ర ప్రభుత్వంలో పదేండ్లు కసరత్తు..
యూపీఏ చైర్‌పర్సన్‌గా సోనియాగాంధీ హయాంలో 2004లోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కసరత్తు మొదలైంది. ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన రఘువంశ ప్రసాద్ సింగ్, దయానిధి మారన్‌తో కమిటీ ఏర్పడింది. రిపోర్టు ఇవ్వకపోయినా ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత ఉద్యమం ఉధృతమైంది. 2009లో అప్పటి హోంమంత్రి చిదంబరం ప్రకటన, ఆ తర్వాత కాంగ్రెస్ ఎంపీల (ఏపీ ప్రాంత) తిరుగుబాటు, అధ్యయనం కోసం శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు.. ఇలాంటివన్నీ పూర్తయ్యి చివరకు పదేండ్ల తర్వాత 2014లో లక్ష్యం నెరవేరింది. ఇంతటి కసరత్తు జరిగినా తెలంగాణ రాష్ట్రం గురించి ఆమె తన ఆత్మకథలో ప్రస్తావించకపోవడమే సరికొత్త చర్చకు దారితీసింది. అనేక రాజకీయ అంశాలను ప్రస్తావించి దీన్ని మాత్రమే విస్మరించడంతో “ఆమె ఇవ్వలేదు.. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ దీక్ష, ఉద్యమంతోనే సాకారమైంది..” అనే వాదన బీఆర్ఎస్ నేతల్లో మొదలైంది. రానున్న రోజుల్లో దీన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి మరోమారు సెంటిమెంట్ రాజేయడానికి ‘ఆత్మకథ’నే అస్త్రంగా ఎంచుకోవాలనే ఆలోచన ఆ పార్టీలో మొదలైంది.
కౌంటర్ ఇవ్వాల్సింది కాంగ్రెస్సే..
సోనియాగాంధీ తెలంగాణను ఇచ్చి ఉంటే దాన్ని తన ‘ఆత్మకథ’లో ప్రస్తావించి ఉండేవారని, ఇంతటి ప్రాధాన్యం ఉన్న అంశాన్ని ఆమె ఎలా విస్మరిస్తారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణను ఆమె ఇవ్వనప్పుడు సాధించుకున్న ఘనత కేసీఆర్‌దే అవుతుందని అంటున్నారు. “సోనియాగాంధీ దయతోనే తెలంగాణ సాకారమైంది..” అంటూ శాసనసభ వేదికగా ముఖ్యమంత్రి హోదాలో 2014లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ సైతం కౌంటర్ ఇవ్వడానికి అసెంబ్లీ రికార్డులు ఉపయోగపడనున్నాయి.
పార్లమెంట్ ఉభయ సభల్లో 2014 ఫిబ్రవరి థర్డ్ వీక్‌లో (ఫిబ్రవరి 18న లోక్‌సభలో, 20న రాజ్యసభలో) తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేసీఆర్ కుటుంబ సమేతంగా ఢిల్లీలోని సోనియాగాంధీ నివాసానికి వెళ్లి కలిసిన అంశాన్ని కూడా ప్రస్తావించడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. తెలంగాణ ఏర్పాటు అంశాన్ని ‘ఆత్మకథ’లో సోనియాగాంధీ ఎందుకు ప్రస్తావించలేదనే దానికి వివరణ ఇవ్వడం, ఆమె వల్లనే రాష్ట్రం ఏర్పడిందని బలమైన వాయిస్‌ను వినిపించడం కాంగ్రెస్‌కు అనివార్యం కానున్నది.

