కలం, వెబ్ డెస్క్ : భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆదివారం జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా భారత్ సాధిస్తున్న ఆర్థిక వృద్ధిని, యువత శక్తిసామర్థ్యాలను ఆమె కొనియాడారు. భారతదేశం త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని రాష్ట్రపతి ధీమా వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక పురోగతి వేగంగా జరుగుతోందని ఆమె వివరించారు.
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్ నిలుస్తోందని, మన యువత అద్భుతమైన ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా స్వయం ఉపాధి రంగంలో యువత సాధిస్తున్న విజయాలను రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రశంసించారు. సొంతంగా వ్యాపారాలు ప్రారంభిస్తూ, ఇతరులకు ఉపాధి కల్పిస్తున్న యువ పారిశ్రామికవేత్తల కృషి దేశాభివృద్ధికి ఎంతో కీలకమని ఆమె తెలిపారు. ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆమె (Droupadi Murmu) పిలుపునిచ్చారు.


