కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) ఇటీవల తరచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఒక కార్యక్రమంలో దివంగత తమిళ స్టార్ హీరో, మాజీ సీఎం ఎంజీఆర్ (MGR) గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రాజేంద్ర ప్రసాద్ తన ప్రసంగంలో సీనియర్ నటుడు కాంతారావును పొగుడుతూ, ఎంజీఆర్‌ను తక్కువ చేసి మాట్లాడటంపై నటుడు విశాల్ (Vishal) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు విశాల్ ఎక్స్ వేదికగా ఓ పోస్టు చేశారు. ఎంజీఆర్ కేవలం ఒక నటుడు మాత్రమే కాదని, తమిళనాడు ప్రజలు ఆరాధించే గొప్ప నాయకుడని.. అలాంటి వ్యక్తిని కించపరచడం కోట్లాది మంది అభిమానుల మనోభావాలను దెబ్బతీయడమేనని విశాల్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
మరో నటుడిని పొగడటం మంచిదే కానీ, ఒక మహోన్నత వ్యక్తిని అవమానించడం సరికాదని విశాల్ హితవు పలికారు. “భవిష్యత్తులో ఎవరైనా రాజేంద్ర ప్రసాద్ వంటి పెద్దల గురించి తప్పుగా మాట్లాడితే ఒక నటుడిగా నేను ఎలా స్పందిస్తానో, ఇప్పుడు కూడా అలాగే స్పందిస్తున్నాను” అని చెబుతూ.. ఈ వివాదానికి ముగింపు పలకాలని ఆయన కోరారు. తన వ్యాఖ్యలపై రాజేంద్ర ప్రసాద్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని విశాల్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఇటు టాలీవుడ్‌లో, అటు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ వ్యాప్తంగా రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

