కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే కూనంనేని (MLA Kunamneni) సాంబశివరావు చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని స్థానిక ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల కొత్తగూడెం, పాల్వంచ బస్టాండ్‌ల దుస్థితిపై కూనంనేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమస్యలు పరిష్కారం కాకపోతే నిరాహార దీక్షకు కూడా వెనుకాడబోనని హెచ్చరించారు.
కూనంనేని వ్యాఖ్యలు చేసి వారం రోజులు కూడా గడవకముందే తెలంగాణ ఆర్టీసీ ఎండీ (TGSRTC MD) నాగిరెడ్డి (Nagi Reddy) సోమవారం పాల్వంచ బస్టాండ్‌ను సందర్శించారు. అక్కడ తాగునీటి సదుపాయం, పారిశుధ్యం, బస్సుల సమయపాలన, మరుగుదొడ్ల నిర్వహణ, ప్రయాణీకులకు సీటింగ్ సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అదే సమయంలో బస్టాండ్‌లో పార్కింగ్ సమస్య తీవ్రంగా ఉందని, దాని వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఎండీ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే స్పందించిన నాగిరెడ్డి (Nagi Reddy), సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. బస్టాండ్ పరిసరాల్లో ఖాళీగా ఉన్న ఆర్టీసీ స్థలంలోని ఫెన్సింగ్ తొలగించాలని అధికారులకు ఆదేశించారు. మిగతా సమస్యలను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ (Palvancha) కార్పొరేటర్లు అడుసుమిల్లి సాయిబాబు, సింధూ తపస్వి, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, పోలీస్ అధికారులు సీఐ సతీష్, ఎస్సై నాగరాజు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.
Read Also: గురుకులాలను నిర్వీర్యం చేస్తున్న రేవంత్ రెడ్డి: ఆర్ఎస్ ప్రవీణ్
Follow Us On : WhatsApp

