కలం, వెబ్ డెస్క్: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ఏర్పాటుతో ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రకు నాంది పలికామని సీఎం చంద్రబాబు (CM Chandrababu) స్పష్టం చేశారు. విజయనగరం జిల్లాలోని భోగాపురంలో శనివారం నూతన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు.
ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన ప్రధాని మోడీకి ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరాంధ్రలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి సహకరించిన రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని.. ప్రజల ఆశీస్సులతో చేస్తున్నామని అన్నారు. ఈ ప్రాంతానికి ఎర్రబస్సు కూడా రాదని కొందరు హేళన చేశారని.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభంతో అవహేళన చేసినవారు అడ్రస్ లేకుండా పోయారని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని అన్నారు.
ఇకపై వలసలు ఉండవ్..
ఉత్తరాంధ్ర దశ దిశను భోగాపురం ఎయిర్ పోర్ట్ మారుస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఇకపై ఉత్తరాంధ్ర నుండి వలసలు ఉండవని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని చూశామని.. కూటమి పాలనతో విధ్వంసం నుంచి వికాసం వైపు ఏపీ పయనిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్రలో రూ.2,784 కోట్లతో 8 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేశామని చెప్పారు. గూగుల్, స్టీల్ కంపెనీలతోపాటు చాలా సంస్థలు వచ్చాయని అన్నారు.
ఆ ఘనత మోడీదే..
ఏపీ అభివృద్ధిని మోడీ భుజాన వేసుకున్నారని.. ఎన్డీయే హయాంలో ఏపీ అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని చెప్పారు. దేశాన్ని ప్రధాని మోడీ 12 ఏళ్లుగా సమర్థంగా నడిపిస్తున్నారని కొనియాడారు. దేశాన్ని డిజిటల్ ఇండియాగా మార్చే ఘనత మోడీదేనని స్పష్టం చేశారు. సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్ ద్వారా దేశంలో కాలుష్యం తగ్గిస్తున్నారని చెప్పారు. దేశంలో తీవ్రవాదం, నక్సలిజం లేకుండా మోడీ ప్రభుత్వం చేసిందని కొనియాడారు. ప్రధాని మోడీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు.

