కలం, నల్లగొండ: గ్రామాల సమగ్ర అభివృద్ధికి గ్రామస్తులందరూ కలిసికట్టుగా ముందడుగు వేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komatireddy Venkat Reddy) పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు రూ. 20 వేల కోట్లతో ఆర్ అండ్ బీ రోడ్ల పనులను చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఇకపై వారానికి ఒకసారి గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తానని, రాబోయే ఆదివారం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. పెద్ద సూరారం గ్రామానికి నూతన సబ్ స్టేషన్ మంజూరైందని, సెప్టెంబర్‌లో శంకుస్థాపన చేసి 3-4 నెలల్లో నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో అంతర్గత రవాణా వసతుల కోసం 60 లక్షల రూపాయలతో సీసీ రోడ్లను మంజూరు చేశారు.
ఆగస్టు 15వ తేదీన గ్రామ మహిళా సంఘాలకు రెండున్నర కోట్ల రూపాయల చెక్కులను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన మహిళా సంఘాలకు గరిష్టంగా రుణాలు అందించాలని అధికారులను ఆదేశించారు. తీసుకున్న రుణాలను క్రమం తప్పకుండా చెల్లించాలని కోరారు. మహిళలు కేవలం చిన్న చిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా, రైస్ మిల్లులను కూడా నిర్వహించేలా ప్రోత్సహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.
ఇందులో భాగంగా చిన్నసూరారం, పెద్ద సూరారం గ్రామాల మధ్య రైస్ మిల్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, నల్గొండ, కనగల్, తిప్పర్తి మండలాల్లోనూ రైస్ మిల్లులను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. గుడిసెలు ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తోందని, మంజూరైన ఇండ్లను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకోవాలని సూచించారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందజేశామని, రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్ల 25 లక్షల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.

