కలం, తెలంగాణ బ్యూరో: ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా మార్చే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకున్నది. ‘‘ఫస్ట్ మైల్–లాస్ట్ మైల్ కనెక్టివిటీ’’ పేరుతో ఎలక్ట్రిక్ ఆటో సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సేవల ద్వారా ప్రయాణికులు ఇంటి నుంచి బస్స్టాప్ వరకు, అలాగే బస్సు దిగిన తర్వాత బస్స్టాప్ నుంచి చివరి గమ్యస్థానం వరకు సులభంగా చేరుకునే అవకాశం కలగనుంది. ఈ విధానం ద్వారా వ్యక్తిగత వాహనాల వినియోగం కూడా తగ్గే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ విధానంలో ప్రయాణికులు బస్సు టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఆటో టికెట్ను కూడా ఒకేసారి బుక్ చేసుకునే సౌకర్యం కల్పించనున్నారు. దీంతో ప్రయాణానికి ముందే మొత్తం రవాణా ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రయాణ సమయం ఆదా
ప్రయాణికుడు ఉన్న ప్రాంతం నుంచి సమీప బస్ పాయింట్ వరకు ఎలక్ట్రిక్ ఆటో సేవలు అందుబాటులో ఉంటాయి. అలాగే బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్లాల్సిన గమ్యస్థానానికి కూడా ఆటో సేవలు కల్పించనున్నారు. దీనివల్ల ప్రయాణ సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం మరింత సౌకర్యవంతంగా, సురక్షితంగా మారనుంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులకు ఈ సేవలు ప్రయోజనకరంగా ఉంటాయని అధికారులు చెప్తున్నారు. ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం వల్ల కాలుష్యం తగ్గి పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడనుంది.
తొలుత గ్రేటర్‌లో
ఈ సేవలను తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. అనంతరం ప్రజల స్పందన, సేవల పనితీరును పరిశీలించి రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలకు విస్తరించేలా ఆర్టీసీ ప్రణాళిక రూపొందించింది. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన, అంతరాయం లేని రవాణా అనుభవాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని ఆర్టీసీ పేర్కొంది.

