కలం, వెబ్‌డెస్క్: కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించి రాష్ట్రాన్ని సాధిస్తే చివరికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దొర కుర్చీలో కూర్చున్నాడని బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి (Jeevan Reddy) విమర్శించారు. శనివారం జీవన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని దొర అని సంభోదిస్తూ ఆయనను పెట్టుబడిదారుడిగా అభివర్ణించారు. సీఎం రేవంత్‌కు ఫోర్త్ సిటీ, హైడ్రా తప్ప ఇంకేం కనిపించవని జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్థిక ప్రయోజనం ఉన్న వాటిపైనే సీఎం దృష్టి ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో నిరుపేద వర్గాలకు కల్పించాల్సిన విద్యా, వైద్యం సదుపాయాలపై మాత్రం ఏమాత్రం శ్రద్ధ లేదని విమర్శించారు.
ప్రభుత్వం జారీ చేసిన జీవో 7 అనేది అన్యాయమని, దీన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నాడు ఎన్నికల ప్రచారంలో ఫీజు రీయింబర్స్ మెంట్ మెరుగైన రీతిలో అమలు చేస్తామన్నారని గుర్తు చేశారు. రేవంత్‌కు కేసీఆర్‌పై కోపం ఉంటే మరో రకంగా చూసుకోవాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. సీఎం రేవంత్ నిరుపేద వర్గాలపై కక్ష కట్టారని, అందుకు పేదలకు సంబంధించిన పథకాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.

