ఎల్‌ నినో భయం దాటి.. వరి వైపు అడుగులు!

కలం, తెలంగాణ బ్యూరో : ఈసారి ఎల్‌ నినో ప్రభావం ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో మరింత తీవ్రమవుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నా, ప్రభుత్వ అధికారులు సూచనలు చేస్తున్నా రైతులు (Telangana Farmers) మాత్రం వరి సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. గత వారం (జులై 22 నాటికి) రాష్ట్రవ్యాప్తంగా 11.02 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే.. వారం రోజుల్లోనే (జులై 29) అది 20.46 లక్షల ఎకరాలకు పెరిగింది. ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలన్న ప్రభుత్వ సూచనల ప్రకారం ఈసారి కందులు, పెసలు, మినుములు, సోయాబీన్ లాంటి పంటల విస్తీర్ణం కూడా పెరిగింది.

ఈ నెల 23 నాటికి రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నార్మల్‌కంటే తక్కువ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నా.. నాలుగైదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతుల్లో ఎల్‌ నినో భయం తొలగిపోయింది. వరి నాట్లు వేసుకోవచ్చన్న నమ్మకం పెరిగింది. మెదక్, ఆసిఫాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, కొత్తగూడెం తదితర జిల్లాల్లో 75 శాతానికి పైగా భూములు సాగులోకి వచ్చాయి. ఇందులో వరి పంటలే ఎక్కువగా ఉన్నాయి. అయితే.. నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, వనపర్తి, నాగర్‌కర్నూల్, ములుగు, జగిత్యాల తదితర జిల్లాల్లో మాత్రం 40% కూడా మొత్తం పంటల విస్తీర్ణం దాటలేదు.

ఆల్టర్నేట్ పంటలతో పాటు..!

ఎల్‌ నినో ప్రభావంతో వర్షాలు తగ్గుతాయని, రిజర్వాయర్లలో నీటి నిల్వలు అడుగంటుతాయని, సాగునీటి సరఫరా ఉండకపోవచ్చని, తక్కువ నీటితో సాగయ్యే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని ప్రభుత్వం గత కొన్ని వారాలుగా రైతులకు సూచనలు చేస్తున్నది. జూన్ సెకండ్ వీక్ నుంచి రావాల్సిన నైరుతి రుతుపవనాల ప్రభావం తగ్గడం, వర్షాలు లేకపోవడంతో రైతులు సాగు పనులను తాత్కాలికంగా ఆపేశారు.

బోరు బావుల మీద ఆధారపడి వరి నారుమళ్లు మాత్రమే సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 23వ తేదీ వరకూ వర్షాలు లేకపోవడంతో ప్రత్యామ్నాయ పంటలే బెస్ట్ అనుకుని.. కందులు, పెసలు, మినుములు, సోయాబీన్ లాంటివాటిపై చాలా ప్రాంతాల్లో ఫోకస్ పెట్టారు. నాలుగైదు రోజులుగా వర్షాలు కురవడం, గోదావరి, కృష్ణా నదుల్లోకి ఇన్‌ఫ్లో పెరుగుతుండడంతో రైతుల్లో ఆశలు చిగురించాయి. దీంతో వారం రోజుల్లోనే దాదాపు రెట్టింపు స్థాయిలో వరి పంట సాగులోకి వచ్చింది. అప్పటికే ప్రత్యామ్నాయ పంటలు మొదలుకావడంతో వాటి విస్తీర్ణం కూడా గతేడాది కంటే పెరిగింది.

ఆ జిల్లాల్లో మాత్రం అంతంతే..!

ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలు సహా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ ఈసారి సాగు విస్తీర్ణం గతేడాది కంటే భారీగా తగ్గింది. ఒకవైపు పంటల టైమ్ ముగిసిపోతున్నదనే ఆందోళన, మరోవైపు సంతృప్తికరంగా వర్షాలు లేవనే కారణంగా వరి నాట్లు పూర్తికాకపోవడంతో ఇక్కడి రైతుల్లో అయోమయం నెలకొన్నది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు పంట చివరి వరకూ ఉంటాయో ఉండవోననే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సైతం ఇదే పరిస్థితి నెలకొన్నది.

కొన్ని జిల్లాల్లో వరి సాగు విస్తీర్ణం..! (ఎకరాల్లో..)

జిల్లా             గత సంవత్సరం          ప్రస్తుతం
నిజామాబాద్    3,72,231                3,30,951
కామారెడ్డి        1,64,017                 2,02,290
కరీంనగర్       1,19,382                 1,49,486
పెద్దపల్లి         1,12,402                 1,24,396
మెదక్            77,887                   1,20,822
జనగాం          80,985                    95,653
కొత్తగూడెం      35,132                    41,660

వరి సహా అన్ని పంటలు సాగు ఇలా..!

ఆదిలాబాద్‌లో 5.80 లక్షల ఎకరాల్లో సాగు ఉంటుందని అంచనా వేస్తే 5.87 లక్షల ఎకరాలు (101%) దాటింది. ఆసిఫాబాద్ జిల్లాలో 98% దాటింది. నిజామబాద్ జిల్లాలో 84%, సంగారెడ్డిలో 83%, కొత్తగూడెంలో 80%, కామారెడ్డిలో 78% దాటింది. వనపర్తి జిల్లాలో 31%, సూర్యాపేటలో 32%, ములుగులో 38%, జగిత్యాలలో 39%, మహబూబ్‌నగర్‌లో 45%, సిద్దిపేటలో 48%, హన్మకొండలో 49% చొప్పున పంటలు సాగవుతున్నాయి.

నల్లగొండలో 15శాతమే వరి!

వరి సాగులో రాష్ట్రంలోనే ముందుండే నల్లగొండ జిల్లాలో మాత్రం ఈసారి విస్తీర్ణం దారుణంగా పడిపోయింది. సగానికి పైగా భూములు ఇంకా బీళ్లుగానే దర్శనమిస్తున్నాయి. ఆగస్టు నెల దాటుతున్నా జిల్లా వ్యాప్తంగా వరి సాగు కేవలం 80 వేల ఎకరాలలోపే పరిమితమైంది. పత్తి కూడా అదే పరిస్థితి. 5.55 లక్షల ఎకరాలకే పత్తి పరిమితమైంది.

జిల్లాలో 5.41 లక్షల ఎకరాల్లో వరి పంట సాగు కావాల్సి ఉండగా.. ఇప్పటి వరకు కనీసం 80వేల ఎకరాలు కూడా చేరలేదు. అంటే 15శాతం కూడా వరిసాగు కాలేదు. నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో విత్తనపు వడ్లు తెచ్చి ఇంటిలోనే పెట్టుకున్నారు తప్ప.. నారు పోసుకోవడం లేదు. ఇక్కడి ప్రాజెక్టుల్లో నీటిమట్టం పడిపోవడం జిల్లా వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. రాబోయే కొద్ది రోజుల్లో విస్తారంగా వర్షాలు కురిస్తే తప్ప నల్లగొండ జిల్లాలో వరి, పత్తి పంటలు కోలుకునే అవకాశం లేదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>