కలం, వెబ్ డెస్క్ : భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కొందరు చేస్తున్న అనుచిత వ్యాఖ్యల పట్ల పవన్ కళ్యాణ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రధానిని ఉద్దేశించి అనరాని మాటలు అంటుంటే వినడానికి తనకు ఎంతో బాధగా అనిపిస్తోందని ఆయన ఆవేదన చెందారు. దేశ శ్రేయస్సు కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులకు సమాజంలో మనం ఇచ్చే గౌరవం ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. సమాజంలో పిల్లలకు, నేటి యువతకు సరైన సంస్కార విలువలు నేర్పడం చాలా ముఖ్యమని, ఈ విషయంలో తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.
ఉదయం తాను ప్రధాని మోదీకి సంబంధించిన ఒక వీడియోను చూశానని, అందులో తనను తీవ్రంగా దూషించిన వారిని సైతం ఆయన ఎంతో ఉదారంగా క్షమించారని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న అటువంటి గొప్ప నాయకుడికి తాను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రధాని మోదీ తన పదవీ కాలంలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశ సేవకే అంకితమయ్యారని కొనియాడారు. భారతదేశ ప్రగతి కోసం ప్రధాని పడినంత కష్టం బహుశా మరే ఇతర నాయకుడూ పడలేదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత తరుణంలో నరేంద్ర మోదీని మించిన మరో గొప్ప నాయకుడు దేశంలో లేరని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఆయన సమర్థవంతమైన నాయకత్వంలోనే భారతదేశం ప్రస్తుతం వికసిత్ భారత్ దిశగా అత్యంత వేగంగా అడుగులు వేస్తోందని ప్రశంసించారు.

