కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని మందుబాబులకు భారీ షాక్ తగలనుంది. ఎక్కడో అమెరికా – ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం మందుబాబుల కిక్ ను ఆపేయనుంది. యుద్ధ ప్రభావంతో మద్యం తయారీకి ఖర్చు ఎక్కువవుతోందని లిక్కర్ కంపెనీలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. దీంతో పాటు ధరల పెంపు (Liquor Price Hike) ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందించాయి. ఈ క్రమంలోనే నివేదికల ఆధారంగా లిక్కర్ రేట్ల పెంపుపై సర్కార్ ఆలోచిస్తోంది. ఉత్పత్తి ఖర్చులు పెరిగినందున 12 నుంచి 15 శాతం ధరలు పెంచాలని లిక్కర్ డిస్ట్రిబ్యూటరీలు ప్రభుత్వాన్ని కోరాయి. కంపెనీలు అందజేసిన ఫైల్ ను ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కూడిన జుడీషియల్ కమిటీకి పంపింది. అంతే కాకుండా వారంలో నివేదికను ఇవ్వాలని సూచించింది. నివేదిక వచ్చిన అనంతరం ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
అయితే, వచ్చే నెల నుంచి పెంచిన ధరలు (Liquor Price Hike) అమలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో మందుబాబులు మద్యం సేవించాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మద్యం ధరలతో పాటు బీర్ల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో మే నెలలో ఎండతో పాటు లిక్కర్ రేట్లు కూడా తీవ్రం కానున్నాయి. చివరి సారిగా 2023 మే లో మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. రూల్స్ ప్రకారం 2025 మే నెలలో ధరలపై మళ్లీ సమీక్షించాల్సి ఉన్నా.. ఆ గడువు ఎప్పుడో ముగిసింది. దీంతో పాటు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా సహజ వాయువు ఉత్పత్తి దెబ్బతిన్నది. ఈ కారణంగా గాజు సీసాల తయారీ తగ్గిపోయింది. దీంతో లిక్కర్ కంపెనీలు మద్యం సీసాలు కొనడం భారంగా మారింది. ఖాళీ మద్యం సీసాల ధరలు 20 శాతానికి పైగా పెరగడంతో.. ఈ అదనపు భారాన్ని భరించలేకపోతున్నామని లిక్కర్ కంపెనీలు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నాయి. వీటన్నింటి దృష్టిలో ఉంచుకున్న సర్కారు వచ్చే నెల నుంచి ధరలు పెంచడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Also: చెన్నైలో టీవీ నటి సుభాషిణి ఆత్మహత్య..
Follow Us On: Facebook

