కలం, వెబ్ డెస్క్ : టెన్నిస్ దిగ్గజం నోవాక్ జకోవిచ్ (Novak Djokovic) వింబుల్డన్‌లో సరికొత్త రికార్డు సృష్టించారు. రోజర్ ఫెదరర్ పేరిట ఉన్న అత్యధిక విజయాల రికార్డును ఆయన అధిగమించారు. ఇదే సమయంలో భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli)పై జకోవిచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే తాను భారతదేశాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. జకోవిచ్‌కు చిన్నప్పటి నుంచి వింబుల్డన్ గెలవాలనే కల ఉండేది. ఆయన 2011లో మొదటిసారి ఇక్కడ ఛాంపియన్‌గా నిలిచారు. ఇప్పటివరకు మొత్తం ఏడుసార్లు ఈ టైటిల్ గెలిచారు.
గతేడాది వింబుల్డన్ మ్యాచ్‌ను విరాట్ కోహ్లీ , అనుష్క శర్మ కలిసి వీక్షించారు. ఆ మ్యాచ్‌లో జకోవిచ్ (Novak Djokovic) విజయం సాధించారు. మ్యాచ్ చూసిన కోహ్లీ సోషల్ మీడియాలో జకోవిచ్‌ను ప్రశంసించారు. ఆయనను ఒక గ్లాడియేటర్‌గా అభివర్ణించారు. తాజాగా జరిగిన నాలుగో రౌండ్ మ్యాచ్‌లో జకోవిచ్ రష్యా ఆటగాడు రోమన్ సఫియుల్లిన్‌ను ఓడించారు. ఈ విజయంతో వింబుల్డన్‌లో 106వ సింగిల్స్ విజయాన్ని నమోదు చేశారు. రోజర్ ఫెదరర్ పేరిట ఉన్న 105 విజయాల రికార్డును బద్దలు కొట్టారు. తద్వారా కెరీర్‌లో 17వ సారి వింబుల్డన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లారు.
ఈ రికార్డు విజయం తర్వాత జకోవిచ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడారు. విరాట్ కోహ్లీతో కలిసి క్రికెట్, టెన్నిస్ ఆడాలని తనకు ఉందని చెప్పారు. కోహ్లీ ప్రపంచ స్థాయి స్టార్ అని కొనియాడారు. భారతదేశంలో ఆయనకు ఉన్న క్రేజ్ అద్భుతమన్నారు. తాను భారత్‌కు వచ్చినప్పుడు కోహ్లీ తనకు ఆతిథ్యం ఇవ్వాలని కోరారు. తనకు భారత క్రికెట్ అంటే ఎంతో గౌరవం ఉందన్నారు. తన దేశమైన సెర్బియాలో క్రికెట్ పెద్దగా ఆడరని చెప్పారు.
కానీ తన టీమ్‌లోని బ్రిటిష్ సభ్యుల వల్ల గత 10-15 ఏళ్లుగా ఈ ఆటను నేర్చుకుంటున్నట్లు తెలిపారు. క్రికెట్ టెక్నిక్, బ్యాట్ స్వింగ్ విషయంలో కోహ్లీ తనకు సహాయం చేయగలరని ఆశాభావం వ్యక్తం చేశారు. వింబుల్డన్ గ్రాస్ కోర్టుపై ఆడటం ఎప్పుడూ ప్రత్యేకమేనని పేర్కొన్నారు. కలిసివచ్చిన కోర్టులో జకోవిచ్ తన రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో ఆయన ఫెలిక్స్ ఆగర్-అలియాసిమ్ లేదా అలెజాండ్రో డేవిడోవిచ్ ఫోకినాతో తలపడనున్నారు.

