కలం, దేవరకొండ: ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమేనని కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ (MLA Balu Naik) తెలిపారు. దేవరకొండ పట్టణంలోని 7వ వార్డులో రూ.80 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్మాణం జరుగుతున్న సీసీ రోడ్డుపై కాలినడకన పర్యటిస్తూ పనుల పురోగతిని పరిశీలించారు. నిర్మాణ పనులు నాణ్యతతో, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవరకొండ పట్టణ అభివృద్ధికి అవసరమైన రహదారులు, డ్రైనేజీలు, తాగునీరు, విద్యుత్ తదితర మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా చేపడుతూ దేవరకొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పున్న శైలజ వెంకటేశ్వర్లు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నరసింహ, మున్సిపల్ అధికారులు, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

