కలం, వెబ్ డెస్క్ : ట్రాఫిక్ చలాన్ల (Traffic Challans) విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు కట్టాలని బైక్ కీస్ లాక్కొని బలవంత పెట్టొద్దని, స్వచ్ఛందంగా చెల్లిస్తేనే వసూలు చేయాలని, చెల్లించకపోతే నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు (TG High Court) తెలిపింది.
సికింద్రాబాద్‌కు చెందిన వి.రాఘవాచారి దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన జస్టిస్ ఎన్వీ శ్రావణ్ కుమార్ బెంచ్.. వాహనాలపై ట్రాఫిక్ చలాన్లు ఉన్నప్పటికీ రోడ్ల మీద వారి నుంచి పోలీసులు బలవంతంగా తాళం చెవులు తీసుకోవడం లేదా బండిని సీజ్ చేయడం తగదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్ల మీద ఉన్న పెనాల్టీని అక్కడికక్కడే బలవంతంగా వసూలు చేసే విధానం కూడా వద్దని స్పష్టం చేశారు.
చలాన్లు పెండింగ్‌లో ఉన్నప్పుడు వాహనదారులు స్వచ్ఛందంగా వాటిని చెల్లించాలని సూచించడంతో పాటు అలా చెల్లించని పక్షంలో చట్ట ప్రకారం వారికున్న హక్కులను కాదని పోలీసులే చొరవ తీసుకోవడం మంచిది కాదని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం వారికి నోటీసులు జారీచేయాలని, కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలని తెలిపారు.
ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారన్న పేరుతో గతేడాది మార్చి 17న ట్రాఫిక్ పోలీసులు చలాన్ ఇష్యూ చేశారని, ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారో చెప్పకుండానే రూ.1200 మేర చలాన్ వేశారని రాఘవాచారి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు మొబైల్ ఫోన్ ద్వారా ఫోటోలు తీసి మూడు చలాన్లు (Traffic Challans) వేశారని పేర్కొన్నారు.
సెంట్రల్ మోటార్ వెహికల్స్ చట్టం (1989)లోని రూల్ 167(ఏ-6) ప్రకారం లేదా మోటార్ వాహనాల చట్టం (1988)లోని సెక్షన్ 128 రెడ్ విత్ 177 ప్రకారం ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెనాల్టీలు వేయడం విరుద్ధమైన చర్య అని ఆయన తరఫు లాయర్ విజయ్ గోపాల్ వాదించారు. 2019 చట్టాన్ని తెలంగాణ ఇంకా పూర్తి స్థాయిలో స్వీకరించనందున 1988 చట్టాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలన్నారు.
Read Also: ప్రజా జీవితంలో తపస్సులా ముందుకెళ్తున్నా : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Follow Us On: Sharechat


