కలం, తెలంగాణ బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత, వడగాడ్పుల (Telangana Heatwave) కారణంగా 16 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం ధృవీకరించింది. వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గత నెలలోనే ప్రభుత్వం సూచనలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. ఉత్తర తెలంగాణ జిల్లాలలో రెడ్ అలర్ట్, ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదు అవుతుండగా, మిగతా జిల్లాలలోనూ 43 డిగ్రీలకు తగ్గడం లేదు.
భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో నలుగురు, వరంగల్ అర్బన్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలలో ముగ్గురు చొప్పున మృతి చెందినట్లు సమాచారం. గద్వాల, రంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలలో ఒక్కరు చొప్పున చనిపోయారు. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. పరిస్థితిని సమీక్షించిన మంత్రి సచివాలయంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు.
భారత వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రాబోయే రోజులలో వడగాల్పుల (Heatwave) తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు అసాధారణ స్థాయికి చేరుతున్నాయని అధికారులు తెలిపారు. ప్రజలు మధ్యాహ్న వేళల్లో బయటకు రావొద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలలో ముందస్తు హెచ్చరికలు జారీ చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది.
Read Also: ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్.. ఎవరికి సేఫ్? ఎవరికి రిస్క్?
Follow Us On: X(Twitter)

