కలం, వెబ్ డెస్క్ : ఈ రోజుల్లో బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే వారికి మొదట గుర్తొచ్చేది ‘ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్’ (Intermittent Fasting). బాడీలోని కొవ్వును కరిగించడానికి, క్యాలరీలను తగ్గించుకోవడానికి చాలామంది ఈ పద్ధతిని ఫాలో అవుతున్నారు. అయితే, చూడ్డానికి ఇది చాలా సులభంగా అనిపించినా.. ప్రాక్టికల్‌గా చేసేటప్పుడు మాత్రం అందరికీ ఒకేలా పని చేయకపోవచ్చు.
ప్రస్తుతం ఎంతో ట్రెండీగా మారిన ఈ ఫాస్టింగ్ అసలు అందరికీ మంచిదేనా అంటే.. కాదనే అంటున్నారు బెంగళూరులోని ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్ సీనియర్ గ్యాస్ట్రోఎంటరాలజీ కన్సల్టెంట్ డాక్టర్ అనుపమ ఎన్ కే. ఈ ఫాస్టింగ్ వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి, అలాగే ఎవరెవరు దీనికి దూరంగా ఉండాలో ఆమె వివరించారు. డాక్టర్ అనుపమ తెలిపిన వివరాల ప్రకారం.. బరువు తగ్గడం, బ్లడ్ షుగర్ కంట్రోల్ అవ్వడం, జీర్ణక్రియ సజావుగా సాగడం వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాల వల్లే ఈ మధ్య కాలంలో చాలామంది దీని వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రతి ఒక్కరి శరీర తత్వం వేర్వేరుగా ఉంటుంది కాబట్టి, దీని ప్రభావం కూడా ఒక్కొక్కరిపై ఒక్కోలా ఉంటుంది.
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎవరికి మంచిది?
కొంతమందికి ఈ ఫాస్టింగ్ పద్ధతి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు కాస్త విశ్రాంతిని ఇస్తుంది. కొన్ని సందర్భాల్లో కడుపు ఉబ్బరాన్ని తగ్గించడానికి, జీవక్రియలను అంటే మెటబాలిజాన్ని క్రమబద్ధీకరించడానికి, అలాగే పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఎవరు జాగ్రత్తగా ఉండాలి?
అయితే, ఇది ట్రెండ్‌లో ఉంది కదా అని అందరూ దీనిని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు, పోషకాహార అవసరాలు ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ గంటల పాటు ఉపవాసం ఉండటం వల్ల బాడీ నెగటివ్‌గా రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా డయాబెటిస్, కడుపులో అల్సర్లు, యాసిడ్ రిఫ్లక్స్ (ఎసిడిటీ), ఈటింగ్ డిజార్డర్స్, దీర్ఘకాలిక లివర్ వ్యాధులు లేదా తీవ్రమైన కడుపు సమస్యలు ఉన్నవారు ఈ ఫాస్టింగ్ ప్రారంభించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పిల్లలు, వృద్ధులు, క్రమం తప్పకుండా మందులు వాడేవారు డాక్టర్ సలహా లేకుండా అస్సలు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయకూడదు. కొన్నిసార్లు భోజనం మానేయడం వల్ల ఉన్న ఆరోగ్య సమస్యలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, ఎక్కువ సమయం ఆహారం తీసుకోకపోతే ఎసిడిటీ, తలనొప్పి, కళ్లు తిరగడం, నీరసం, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఎదురవుతాయి.
అసలు విషయం ఏంటంటే..
కేవలం ఫాస్టింగ్ టైమింగ్స్ పాటించడం మాత్రమే ముఖ్యం కాదు, మనం తినే ఆహార నాణ్యత కూడా అంతే ముఖ్యమని డాక్టర్లు గుర్తు చేస్తున్నారు. ఫాస్టింగ్ విండో ముగిసిన తర్వాత జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు తింటే ఉపవాసం వల్ల వచ్చే ప్రయోజనాలేవీ దక్కవు. సమయపాలనతో పాటు బాడీకి సరిపడా నీళ్లు తాగడం, పండ్లు, కూరగాయలు, ప్రోటీన్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా అవసరం.

