Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ హైవే.. గంజాయి రవాణాకు నయా అడ్డా!

క‌లం, మెద‌క్ బ్యూరో : హైదరాబాద్ – ముంబై జాతీయ రహదారి –65 గంజాయి రవాణా (Ganja Smuggling)కు అడ్డాగా మారింది. పోలీసులు ఎంత నిఘా పెట్టినా, ఎన్నిసార్లు పట్టుకున్నా.. రూట్ మార్చడం, సరికొత్త పద్ధతుల్లో స్మగ్లింగ్ చేయడం గంజాయి ముఠాలు ఆపడం లేదు. ఇటీవ‌ల ముంబయి హైవే పైన వివిధ ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తున్న గంజాయి ప‌ట్టుబ‌డింది.

ఈ హైవేనే ఎందుకు..?

హైద‌రాబాద్ – ముంబై వెళ్లే జాతీయ రహ‌దారి ప‌టాన్ చెరువు ఓఆర్ఆర్, సంగారెడ్డి, స‌దాశివ‌పేట‌, జ‌హీరాబాద్ మీదుగా వెళ్తుంది. ఏపీలోని వైజాగ్, అరకు లోయల నుంచి వచ్చే గంజాయి విజయవాడ మీదుగా హైదరాబాద్ నుంచి ముంబై హైవే ద్వారా మహారాష్ట్రలోని పుణె, ముంబై, గుజరాత్ లకు తరలించడం సులువుగా ఉంటుంది. ముంబై హైవేపై నిత్యం వేలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఆర్థిక రాజ‌ధాని ముంబైకి వివిధ రంగాల‌కు చెందిన వ‌స్తువులతో లారీలు, డీసీఎంలు వెళ్లి వ‌స్తుంటాయి.

హైద‌రాబాద్ నుంచి ముంబై వెళ్లే హైవే పై ప‌గ‌లు, రాత్రి తేడా లేకుండా వాహనాల రద్దీ ఉంటుంది. దీంతో ప్రతి వాహనాన్ని ఆపి, క్షుణ్ణంగా తనిఖీ చేయడం పోలీసులకు సవాలుగా మారుతున్నది. దీన్నే స్మగ్లర్లు అడ్వాంటేజ్‌గా తీసుకొని గంజాయి, డ్రగ్స్ ను అక్రమ ర‌వాణా చేస్తున్నారు. హైవేకు ఓఆర్ఆర్ అనుసంధానంగా ఉంది హైదరాబాద్ శివార్లలోని ప‌టాన్ చెరు వ‌ద్ద ఔటర్ రింగ్ రోడ్డు ద్వారా సిటీ లోపలికి రాకుండానే నేరుగా ముంబై హైవే వైపు రాక‌పోక‌లు సాగిస్తుండగా ఇటీవ‌ల ఓఆర్ఆర్ ప్రాంతాల్లో వాహనాల త‌నిఖీల్లో గంజాయి ప‌ట్టివేత‌లు ఎక్కువ‌గా అవుతున్నాయి. ఏపీ – ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుంచి మహారాష్ట్ర, గుజరాత్ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు గంజాయిని గుట్టుచప్పుడు కాకుండా చేరవేయడానికి స్మగ్లర్లు ముంబై హై వేను షార్ట్‌కట్‌గా వాడుకుంటున్నారు.

సరికొత్త ఎత్తుగడలు

పోలీసులు వాహ‌నాల్లో తనిఖీలు ఎక్కువవడంతో స్మగ్లర్లు కొత్త పద్ధతుల్లో అక్రమ రవాణా కొనసాగిస్తున్నారు. కార్లు, లారీల బాడీల్లో ప్రత్యేకంగా సీక్రెట్ క్యాబిన్‌లను తయారు చేయించుకుని, లోపల ప్రత్యేక అరలు నిర్మించి వాటిలో గంజాయిని ప్యాక్ చేసి రవాణా చేస్తున్నారు. నిత్యావసర సరుకుల వాహనాలను, కూరగాయలు, పండ్ల లోడ్ వాహ‌నాల‌ను పోలీసులు ఎక్కువగా అనుమానించరనే నమ్మకంతో వాటి కింద గంజాయి మూటల‌ను తీసుకెళ్తున్నారు.

మ‌రికొంద‌రు లగ్జరీ కార్లను రెంట్ ను తీసుకుని, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ప్రయాణిస్తున్నట్లు నటిస్తూ గంజాయితో చెక్‌ పోస్టులు దాటుతున్నారు. ఇటీవ‌ల స్లిప‌ర్ సెల్ త‌ర‌హా స్థానికంగా గంజాయి ముఠాలతో సంబంధం లేనివారితో త‌ర‌లిస్తున్నారు. కొరియ‌ర్ బాయ్ మాదిరిగా గంజాయి తీసుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో నకిలీ అడ్రస్‌లతో ట్రావెల్ బ‌స్సులు, కొరియర్ కంటైనర్లలో కూడా గంజాయిని పార్సిల్స్ గా తరలిస్తూ పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. కొన్ని నెలలుగా హైవే పైన రూ. కోట్ల విలువైన గంజాయి పట్టుబడుతున్నది.

రవాణా ముఠాలు పట్టుబడట్లేదు..

పోలీసులు దాడులు చేస్తున్నా కానీ.. అక్రమ ర‌వాణా వివిధ మార్గాల్లో కొన‌సాగుతూనే ఉంది. అయితే హైవేపై గంజాయి, డ్రగ్స్ ను తరలించే ప్రధాన సూత్రధారులు, కీల‌క‌ ముఠాలు పోలీసులు ప‌ట్టుకోడంలేదు. పట్టుబడిన వారిలో ఎక్కువమంది ఒడిశా, ఏపీ, మహారాష్ట్రలకు చెందిన అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే ఉంటున్నారు. వీరి వెనుక ఉండి గంజాయి స్మగ్లింగ్ చేయిస్తున్న ప్రధాన ముఠాలపై పోలీసులు దృష్టి సారించాలి. త‌నిఖీల్లో కేవలం డ్రైవర్లను మాత్రమే కాకుండా, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులు ప‌ట్టుకోవాల్సి ఉంది.

ప్రస్తుత టెక్నాల‌జీను ఉప‌యోగించి గంజాయి అక్రమ‌ ర‌వాణాను అరిక‌ట్టాలి. సంగారెడ్డి పోలీసులు గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు శ్రమిస్తున్న ప్పటికీ అడ్డుకట్ట పడడంలేదు. ప‌క్కా స‌మాచారంతో త‌నిఖీలు, దాడులు నిర్వహిస్తున్నారు. అయితే భారీ లాభాల ఆశతో స్మగ్లర్లు కొత్త దారులు వెతుకుతూనే ఉన్నారు. హైద‌రాబాద్ – ముంబై హై వేపై మ‌రింత పెట్రోలింగ్ పోలీసింగ్ పెంచ‌డంతో పాటు, గంజాయి నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా ప్రత్యేక‌ ఆపరేషన్లు నిర్వహించాలి.

గతంలోనూ..

మార్చి 23న సీసీఎస్ న్యాబ్, సదాశివపేట పోలీసులు సంయుక్తంగా చేపట్టిన తనిఖీల్లో రూ.2.87 కోట్ల విలువైన 574 కిలోల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ముంబై హైవే పైన సదాశివపేట నుంచి సంగారెడ్డి వైపు వెళ్లే డీసీఎంను తనిఖీ చేయగా భారీగా గంజాయి ప్యాకెట్లు కనిపించాయి. మహారాష్ట్రకు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

మే 11న సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పీఎస్ పరిధి ముత్తంగి ఓఆర్ఆర్ ఎగ్జిట్-3 వద్ద కూకట్ పల్లి ఎస్ఓటీ పోలీసులు ఆపరేషన్ చేపట్టి భారీగా గంజాయిని పట్టుకున్నారు. ఒడిశా నుంచి షోలపూర్ వైపు తరలిస్తున్న 400 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు గంజాయి పెడ్లర్లను అదుపులోకి తీసుకున్నారు.

జూలై 2న అమీన్‌పూర్ పోలీసులు, ఎస్ ఓటీ కలిసి ఓఆర్ఆర్ సుల్తాన్‌పూర్ ఎగ్జిట్-4 వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా వచ్చిన బొలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు. వాహనంలో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్స్ లో దాచిపెట్టి తీసుకెళ్తున్న 17 ప్యాకెట్లలో 34.50 కిలోల ఎండిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>