కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal) జిల్లాలో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టుల కుటుంబాలకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం వెలువడింది. జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ట్యూషన్ ఫీజులో 50 శాతం రాయితీ కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న(DEO Bhojanna) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాలలో పనిచేస్తున్న జర్నలిస్టులు తమ పిల్లల విద్య కోసం అధిక ఫీజులు చెల్లించాల్సి వస్తోందని పేర్కొంటూ, ఫీజులలో రాయితీ కల్పించాలని జిల్లా కలెక్టర్, డీఈఓకు వినతిపత్రం సమర్పించారు. ఈ వినతిపై అధికారులు సానుకూలంగా స్పందించి సమస్యను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు.
బుధవారం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, జిల్లాలోని గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ట్యూషన్ ఫీజులో 50 శాతం రాయితీ అమలు చేయాలని సంబంధిత పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించారు. ఈ నిర్ణయంతో నిర్మల్ జిల్లాలోని జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యను గుర్తించి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

