Mobile Popup Ad
Mobile Popup Ad

ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే: జగదీశ్ రెడ్డి

కలం, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు చింతలపాటి మధు (Chintalapati Madhu) దారుణ హత్య రాజకీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇటీవల హత్యకు గురైన మధు మృతదేహానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జగదీశ్ రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చింతలపాటి మధు హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన.. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ హత్యేనని ఆరోపించారు. ఈ ఘాతుకంలో పోలీసుల భాగస్వామ్యం కూడా ఉందనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు.

కాంగ్రెస్ రౌడీల చేతుల్లో పోలీస్ స్టేషన్లు..

“నువ్వు ఎగిరిపోతావ్” అని స్వయంగా ఓ ఎస్ఐ మధును హెచ్చరించారంటేనే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుందని, అలా వ్యాఖ్యానించిన సదరు అధికారికి మధును కాపాడే బాధ్యత లేదా? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. మధును నమ్మించి తీసుకెళ్లి కిరాతకంగా చంపేశారని, ఈ హత్యకు కాంగ్రెస్ నాయకులతో పాటు పోలీసు అధికారులే బాధ్యులని ఆరోపించారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ రౌడీల చేతుల్లో ఉన్నాయని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నరేళ్లుగా అరాచకాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. సూర్యాపేటలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, బీఆర్ఎస్ నాయకులను స్టేషన్లకు పిలిపించి కాంగ్రెస్ గుండాల ముందు నిలబెట్టి అవమానిస్తున్నారని ఆరోపించారు.

పార్టీలో చేరాలని ఒత్తిడి చేయడం సిగ్గుచేటు..

పోలీసులు కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారి, బీఆర్ఎస్ శ్రేణులను ఆ పార్టీలో చేరాలని ఒత్తిడి చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులను సైతం అవమానిస్తున్నారని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో బీఆర్ఎస్ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్నను (Onteddu Venkanna) కాంగ్రెస్ గుండాలు హత్య చేశారని, ఆ కేసు ట్రయల్ నడుస్తున్న తరుణంలో సాక్షిగా ఉన్న మధును భయపెట్టే ప్రయత్నం చేశారన్నారు. కేసును బలహీనపరిచేందుకే సడన్‌గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని మార్చారని దుయ్యబట్టారు. కేసు ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుందో, రిమాండ్ రిపోర్టులో ఏం చూపిస్తారో నిమిష నిమిషం గమనిస్తామని జగదీశ్ రెడ్డి (Jagadish Reddy) స్పష్టం చేశారు. తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తే ఏ అధికారినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

కేసులను తిరగతోడి మరీ చర్యలు తీసుకుంటాం..

“విచారణలో తప్పులు చేస్తే ఐజీ స్థాయి అధికారులను కూడా పదేళ్ల తర్వాత జైళ్లకు పంపిన ఘటనలు చూశాం. ఇప్పుడు కాంగ్రెస్‌కు తొత్తులుగా వ్యవహరిస్తే.. భవిష్యత్తులో కేసులను తిరగతోడి మరీ చర్యలు తీసుకుంటాం” అని జగదీశ్ రెడ్డి హెచ్చరించారు. నిజమైన నిందితులను గుర్తించి చట్టప్రకారం శిక్ష పడేలా పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. అప్పటివరకు బీఆర్ఎస్ శ్రేణులు శతాబ్దాల నాటి నల్లగొండ ఫ్యాక్షన్ రాజకీయాల వైపు వెళ్లకుండా, సమయమనం పాటించాలని కోరారు. హత్యకు గురైన మధు కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మధు ఇద్దరు ఆడపిల్లల చదువుల బాధ్యతను, అలాగే వారి కుటుంబ పోషణ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా తీసుకుంటుందని ప్రకటించారు. గతంలో ఒంటెద్దు వెంకన్న కుటుంబానికి ఏ విధంగానైతే అండగా నిలిచామో, అదే రీతిలో మధు కుటుంబానికి కూడా న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు.
Follow Us On: Instagram
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>