Mobile Popup Ad
Mobile Popup Ad

ఇందూరుకు నిధులివ్వండి.. లేదా ఆందోళన చేస్తా: ధన్ పాల్ సూర్యనారాయణ

కలం, నిజామాబాద్ బ్యూరో: ఇందూరు అర్బన్ నియోజకవర్గానికి అభివృద్ధికి నిధులు ఇవ్వండి.. లేదా కాంగ్రెస్ నేతలు రాజీనామా చేయాలని బీజేపీ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ (Dhanpal Suryanarayana) గుప్తా డిమాండ్ చేశారు. ఇందూరు పార్టీ కార్యాలయంలో శనివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ళు గడిచినా ఒక్క రూపాయి నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు. జిల్లాపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ప్రజలను మభ్యపెడుతూ ముందుకు సాగుతుందని దుయ్యబట్టారు. వైఎస్ఆర్, డీఎస్ మాదిరిగా.. రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ జోడీ లక్కీ అంటున్నారు కానీ.. కేవలం జేబులు నింపడానికి జోడీ కలిసిందన్నారు. అర్బన్ (Nizamabad Urban) విషయంలో అనేక సార్లు మంత్రులను, అధికారులను కలిసి వినతులు అందించినా.. లాభం లేకుండా పోతుందన్నారు.

నిధులు తేవడంలో ఫెయిల్..

ప్రభుత్వ పెద్దలు జిల్లాలో అనేక మంది ఉన్నా.. నిధులు తేవడంలో విఫలమయ్యారని ధన్ పాల్ ఆరోపించారు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ కు ఓఆర్ఆర్ లు మంజూరు చేశారు కానీ.. నిజామాబాద్ పై చిన్నచూపు ఎందుకని ఎమ్మెల్యే ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఫిబ్రవరిలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు వచ్చి ఓఆర్ఆర్ తీసుకొస్తానంటూ ప్రకటించారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పీసీసీ ప్రెసిడెంట్ జిల్లా వాసి, ఇద్దరు ప్రభుత్వ సలహాదారులు, చైర్మన్లు ఉన్నారని అన్నారు. రూరల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ కు చెందిన వ్యక్తే అయినా.. నగరానికి రింగురోడ్డు తేలేకపోయారని విమర్శించారు. మాజీ సీఎం వైయస్సార్ సమయంలోనే జిల్లాకు 52 కిలోమీటర్ల ఓఆర్ఆర్ ప్రణాళిక సిద్ధమైందని.. ఏళ్లు గడుస్తున్న పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

నత్తనడకన పనులు..

కేవలం 11 కిలోమీటర్ల బైపాస్ రోడ్డును 12 ఏళ్లుగా పూర్తి చేయకుండా నత్తనడకన నడిపిస్తున్నారని ధన్ పాల్ విమర్శించారు. అలాగే ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కు ఆయా అభివృద్ధి పనుల కోసం 5,620 కోట్లు నిధులు వచ్చాయన్నారు. రాష్ట్ర వాటాతో నిధులు సమకూరాయని, కానీ నిజామాబాద్ కు మాత్రం విస్మరించారన్నారు. నిజామాబాద్ అర్బన్ లో 30 ఏళ్లుగా మాస్టర్ ప్లాన్ అటకెక్కిందని, స్టేడియం నిర్మిస్తామని హామీ ఇచ్చి విస్మరించారని కళాభారతి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లు అసంపూర్తిగా మిగిలిపోయాయని చెప్పారు. కాంట్రాక్టర్లకు నిధులు చెల్లించకపోవడంతో నిలిచిపోయాయని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు..

కేంద్రం నుంచి నిధులు నిండుగా వస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే బీజేపీ పోరాటం ఉదృతం చేస్తుందన్నారు. వచ్చే వారంలో సీఎంని కలుస్తానని, స్పందించకపోతే తమ సత్తా చాటుతామని హెచ్చరించారు. ప్రెస్ మీట్ లో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి స్రవంతి రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగోల్ల లక్ష్మీనారాయణ, పోతన్ కర్ లక్ష్మీనారాయణ, బీజేపీ ఫ్లోర్ లీడర్ ప్రమోద్, కార్పొరేటర్లు న్యాలం సునీత రాజు, మఠం పవన్, చింతకాయల రాజేందర్, కల్పే చిరంజీవి, జగదీష్ కులకర్ణి, పసునూరి రాము మండల అధ్యక్షులు ఇప్పకాయల కిషోర్, భూపతి తదితరులు పాల్గొన్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>