కలం, నల్లగొండ బ్యూరో : ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఓటర్ల ప్రత్యేక సవరణ క్షేత్రస్థాయిలో నత్తనడకన సాగుతోంది. పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాల్సిన ‘సర్’ పై అధికారులు, బీఎల్ఓల నిర్లక్ష్యం తీవ్ర గందరగోళానికి దారితీస్తోంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని దాదాపు 27. 24 లక్షల మంది ఓటర్ల భవిష్యత్ కు సంబంధించిన ప్రక్రియపై కనీస బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అయోమయంలో లక్షలాది ఓటర్లు
నల్లగొండ జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ, సాగర్, దేవరకొండ, మునుగోడు, నకిరేకల్ సెగ్మెంట్లలో దాదాపు 13.92 లక్షల మంది, సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, తుంగతుర్తి స్థానాల్లో సుమారు 7.74 లక్షల మంది, యాదాద్రి జిల్లాలో భువనగిరి, ఆలేరు ప్రాంతాల్లో దాదాపు 4.09 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి లక్షలాది మంది ఓటర్ల వివరాలను సరిచూడాల్సిన బాధ్యతను బీఎల్ఓలు పట్టించుకోవడంలేదు. సీన్ పూర్తిగా రివర్స్ అయింది.
పనులు మానుకుని ఎదురుచూపులు
ఎన్నికల సంఘం రూల్స్ మేరకు బీఎల్ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సరిచూడాలి. కానీ, ఉమ్మడి జిల్లాలోని మెజారిటీ గ్రామాల్లో బీఎల్ఓలు పంచాయతీ ఆఫీసుల వద్దనో, గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్దనో కూర్చుంటున్నారు. ‘మేము ఇక్కడే ఉంటాం.. మీరే వచ్చి ఫారాలు తీసుకెళ్లి, నింపి ఇవ్వాలి’ అంటూ హుకుం జారీ చేస్తున్నారు. ప్రజలు తమ పనులు మానుకుని బీఎల్ఓల కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నారు. అయినా ఇంటింటికి వెళ్లడంలేదు. దీంతో ‘సర్’ ప్రక్రియ గ్రామ కార్మికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
పథకాలు కట్ అవుతాయనే ప్రచారం
గ్రామాల్లో ‘సర్’ ఫారాలు నింపకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రేషన్, పెన్షన్లు కట్ అవుతాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది కాస్త హైదరాబాద్, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన కుటుంబాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తింస్తోంది. ఎక్కడ తమ ఓట్లు, పథకాలు పోతాయోననే భయంతో వారందరూ సొంతూళ్లకు క్యూ కడుతున్నారు. మరోవైపు క్షేత్రస్థాయిలో ఫామ్స్ పంపిణీలో అధికారులు విఫలం చెందారు. ఫామ్స్ కోసం ప్రజలు పెద్ద పోరాటమే చేయాల్సి వస్తోంది. ఒకవేళ దొరికినా.. నిరక్షరాస్యత కారణంగా ఎలా నింపాలో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా 2002 ఓటరు జాబితాలో పేరు ఉండాలనే నిబంధనపై గ్రామాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అసలు ఆ జాబితా ఎక్కడ దొరుకుతుంది? తమ పేరు ఉందో లేదో ఎలా చూసుకోవాలనే దానిపై కనీస అవగాహన కల్పించేవారే లేరు. ఫారాల్లోని కాలమ్స్ నింపే విధానం తెలియక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇంటింటికీ వెళ్లని బీఎల్ఓలు
బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సరిచూడాలేదని ఆరోపణలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో బీఎల్ఓలు వెళ్లారా.. ఫామ్స్ పంపిణీ సక్రమంగా ఉందా..? అని అధికారుల పర్యవేక్షణ ఉండాలి కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారులు ఆఫీసులకే పరిమితమయ్యారని వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సర్ ప్రక్రియను సజావుగా పూర్తి చేయడంలో అధికారులు ఫెయిల్ అయ్యారని పలువురు మండిపడుతున్నారు. కలెక్టర్లు, ఎన్నికల అధికారులు స్పందించి ‘సర్’ ప్రక్రియను ఇంటింటికీ జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
15లోగా డిజిటైజేషన్ పూర్తి
ఇదిలాఉంటే ఈనెల 15లోగా సర్ ఫారాల డిజిటైజేషన్ పూర్తి చేయాలని నల్లగొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. పెండింగ్‌లోని ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు బీఎల్‌ఓలు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేసి, వివరాలను సక్రమంగా నమోదు చేయాలని తెలిపారు. ప్రతి రోజు కనీసం 2,500 ఫారాల లక్ష్యంతో పని చేసి, నిర్దేశిత గడువులోగా పెండింగ్ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్‌లు, బీఎల్‌ఏలతో సమావేశాలు నిర్వహించి ఎస్‌ఐఆర్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని సూచించారు.

