కలం, వెబ్ డెస్క్ : దేశంలోనే మొట్టమొదటి మంచినీటి చేపల అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రం (ఇంటర్నేషనల్ ఇన్లాండ్ ఫిషరీస్ ఎక్స్ పోర్ట్ హబ్) (Koheda Fish Export Center) హైదరాబాద్ శివార్లలోని కోహెడలో ఏర్పాటు కాబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో మత్స్య సంపద రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు చేపలను నేరుగా ఎగుమతి చేసేందుకు వీలుగా ఈ భారీ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. దాదాపు 13 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ.47 కోట్ల భారీ వ్యయంతో ఈ కేంద్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నారు.
ఈ మెగా ప్రాజెక్టుకు సంబంధించి ఈ నెల 10వ తేదీన అధికారికంగా శంకుస్థాపన జరగనుంది. పనులు వేగంగా పూర్తి చేసి 2027 ఆగస్టు నాటికి ఈ ఎగుమతి కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నారు. ఈ అంతర్జాతీయ కేంద్రం అందుబాటులోకి వస్తే కేవలం వ్యాపార రంగానికే కాకుండా ఉపాధి రంగానికి కూడా భారీ ఊతం లభించనుంది. సుమారు 5,000 మందికి పైగా స్థానికులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వేలాది జలాశయాలు, కృష్ణా, గోదావరి నదుల ద్వారా లభించే నాణ్యమైన మంచినీటి చేపలను అత్యాధునిక కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్ సదుపాయాల ద్వారా ఇక్కడి నుండి విదేశాలకు తరలించనున్నారు.

