epaper
Sunday, January 25, 2026
spot_img
epaper

ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. గ్రామీణ ఉపాధిపై సర్కారు సతమతం

కలం, తెలంగాణ బ్యూరో : గ్రామీణ ఉపాధి హామీ (MGNREGS) పథకం అమలు రాష్ట్ర ప్రభుత్వానికి సంకటంగా మారింది. పాత పథకం పేరులో మహాత్మాగాంధీ పేరు తీసేయడాన్ని, పాత చట్టానికి సవరణలు చేయడాన్ని కాంగ్రెస్ (Congress) పార్టీ వ్యతిరేకించింది. దేశవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం అసెంబ్లీ (Telangana Assembly) వేదికగా తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపింది. పేరు మార్పుతో పాటు పాత చట్టం స్ఫూర్తి కూడా అటకెక్కిందని ఆ తీర్మానంలో (Resolution) పేర్కొన్నది. మరోవైపు కొత్త చట్టాన్ని ఆరు నెలల వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఆడాప్ట్ (Adapt) చేసుకోకపోతే వాటిని అమలు చేయడం వీలు పడదని, లీగల్ చిక్కులొస్తాయన్నది రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ అభిప్రాయం. దీంతో రాష్ట్రంలో కొత్త చట్టం అమలయ్యేలా అడాప్ట్ చేసుకోవడమా?.. లేక కాంగ్రెస్ విధానానికి అనుగుణంగా అమలు చేయకుండా వదిలేసుకోవడమా?.. ఇదీ ఇప్పుడు రాష్ట్ర సర్కార్‌ను వేధిస్తున్న ప్రశ్న.

నెలకు మూడున్నర వేల కోట్ల నష్టం :

కేంద్రం ఇటీవల సవరించిన కొత్త చట్టాన్ని (VB-G RAM G) అడాప్ట్ చేసుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా సుమారు మూడున్నర వేల కోట్ల మేర ఫండ్స్ ఆగిపోతాయని పంచాయతీరాజ్ శాఖ తేల్చింది. కొత్త చట్టం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మీద 40% మేర సుమారు రూ. 1,267 కోట్ల మేర భారం పడినా కేంద్రం నుంచి 60% వాటాగా రూ. 3,533 కోట్లు వస్తాయని అంచనా వేసింది. ఈ చట్టాన్ని అడాప్ట్ చేసుకోకపోతే ‘జీ రామ్ జీ’ పథకాన్ని అమలు చేయడం లీగల్‌గా చెల్లుబాటు కాదని ఆ శాఖ పేర్కొన్నది. దీంతో రాష్ట్రానికి నిధులు రాకపోగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడానికి ప్రత్యామ్నాయం ఉండదు. కష్టకాలంలో పేద కుటుంబాలకు ఆసరా అందక అశాంతికి దారితీసే ప్రమాదం కూడా ఉన్నది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం తలనొప్పిగా మారింది.

ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. :

వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అడాప్ట్ చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ విధానపరంగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించినట్లవుతుంది. దీనికి తోడు రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన తీర్మానానికి అర్థం లేకుండా పోతుంది. పార్టీ ఒక లైన్ తీసుకుంటే ప్రభుత్వం మరో రకంగా వ్యవహరిస్తుందనే విమర్శలకు తావిచ్చినట్లవుతుంది. చట్టాన్ని అడాప్ట్ చేసుకోకపోతే కేంద్రం నుంచి ఈ పథకం ద్వారా వచ్చే మూడున్నర వేల కోట్ల రూపాయలు రాకపోగా గ్రామీణ పేదలకు ప్రత్యామ్నాయం చూపడం సవాలుగా మారుతుంది. దీంతో సైద్ధాంతికంగా, నైతికంగా, ఆచరణాత్మకంగా.. ఇలా వేర్వేరు ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా రాష్ట్రానిక సంకట పరిస్థితులు తప్పేలా లేవు. ముందు నుయ్యి.. వెనక గొయ్యి.. తరహాలో మారిన పరిస్థితుల్లో ముఖ్యమంత్రి, మంత్రివర్గం ఎలాంటి నిర్ణయానికి వస్తుందనేది ఆసక్తికరం.

బడ్జెట్ సెషన్ నాటికి స్పష్టత? :

కేంద్రం సవరించిన వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని అడాప్ట్ చేసుకునే విషయంలో త్వరలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావించడంతో పాటు ఏఐసీసీ నేతలతోనూ ముఖ్యమంత్రి చర్చించే అవకాశమున్నది. ఆ తర్వాతనే దీనిపై ఒక నిర్ణయం తీసుకోవడంతో పాటు విపక్షాల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టడానికి కూడా తగిన వ్యూహాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అడాప్ట్ చేసుకుంటే ఒక తంటా… చేయకపోతే మరో తంటా.. తరహాలో కొత్త చట్టం రాష్ట్రానికి గుదిబండగా తయారైంది. ఫిబ్రవరి చివర్లో లేదా మార్చి ప్రారంభంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే అడాప్ట్ చేసుకోడానికి వీలుగా లీగల్ ప్రక్రియ కొలిక్కి వచ్చే అవకాశమున్నది.

రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనాలకు అనుగుణంగా పాత, కొత్త చట్టాల మధ్య వ్యత్యాసం, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే కేంద్ర నిధుల్లో కోత, రాష్ట్ర ప్రభుత్వం భరించనున్న భారం.. వీటిని లెక్కలు వేసి ప్రభుత్వానికి వివరించింది. ఆ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి…

పాత చట్టం (MGNREGS) ప్రకారం… (కోట్ల రూ.లలో)

వివరం                                 మొత్తం               కేంద్ర వాటా            రాష్ట్ర వాటా
వేజ్ ఎక్స్ పెండిచర్                 3000                    3000                      0
మెటీరియల్ కాంపొనెంట్           2000                    1500                     500
అడ్మినిస్ట్రేషన్ ఖర్చు                300                       300                       0
మొత్తం                                 5300                    4800                     500

కొత్త చట్టం ప్రకారం… (కోట్ల రూ.లలో)

వివరం                              మొత్తం            కేంద్ర వాటా     రాష్ట్ర వాటా
వేజ్ ఎక్స్ పెండిచర్             3000                   2000            1000
మెటీరియల్ కాంపొనెంట్       2000                   1333              667
అడ్మినిస్ట్రేషన్ ఖర్చు             300                      200             100
మొత్తం                             5300                    3533           1767

Read Also: మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కవిత సంచలన నిర్ణయం ?

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>