కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ఉత్తమ విధులు నిర్వహించిన అధికారులకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయి అవార్డుల (State Level Awards) ను ప్రకటించింది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అత్యుత్తమ పనితీరు చూపిన IAS అధికారులు, ఇతర అధికారులకు వివిధ విభాగాల్లో అవార్డులు ఇవ్వనున్నారు. ఎన్నికల లాజిస్టిక్స్, శిక్షణ, ఓటర్ అవగాహన కార్యక్రమాల్లో ఆవిష్కరణలు మొదలైన విభాగాల్లో అవార్డులు స్వీకరించనున్నారు.
వీరిలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, జనగామ కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, వరంగల్ కలెక్టర్ సత్య శారద, సిద్దిపేట కలెక్టర్ హైమావతి, భువనగిరి కలెక్టర్ హనుమంతరావు, నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ప్రత్యేక గుర్తింపును ఇస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్, అడిషనల్ కమిషనర్ సాయిరామ్ ఎంపిక చేశారు. రవీంద్ర భారతి వేదికగా జరిగే కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా అవార్డులు అందుకోనున్నారు.


