కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఈఏపీసెట్ (EAPCET) 2026 షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యా మండలితో చర్చించిన తర్వాత జేఎన్‌టీయూ (JNTU) విడుదల చేసింది. ఈఏపీసెట్‌ను జేఎన్‌టీయూ (JNTU) నిర్వహించనుంది. ఈఏపీసెట్‌కు సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 14న విడుదల కానున్నది. ఉన్నత విద్యామండలి, జేఎన్‌టీయూ జనవరి 30న సమావేశమైన తర్వాత షెడ్యూలు ఖరారైంది. ఆ ప్రకారం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను అప్‌లోడ్ చేసే ప్రక్రియ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానుంది. ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకునేందుకు ఏప్రిల్ 14 వరకు గడువు ఉన్నది. ఏప్రిల్ 4 నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వ్యవసాయ, ఫార్మసీ విభాగాల పరీక్షలు మే 4, 5 తేదీల్లో జరుగుతాయి. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన పరీక్షలు మే 9, 10, 11 తేదీల్లో జరుగుతాయి. ఈఏపీసెట్‌కు సంబంధించిన ప్రాథమిక కీ, ఫలితాలను జూన్ 2026లో విడుదల కానున్నాయి.
తెలంగాణ కామన్ ఎంట్రెన్స్ టెస్టుల వివరాలు :
బీఈడీ ప్రవేశాల కోసం టీజీ ఎడ్‌సెట్(EDCET) పరీక్షను కాకతీయ యూనివర్సిటీ మే 12న నిర్వహించనుంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం టీజీ ఐసెట్ పరీక్షలను మహాత్మా గాంధీ యూనివర్సిటీ మే 13, 14 తేదీల్లో నిర్వహించనుంది. లేటరల్ ఎంట్రీ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల కోసం టీజీ ఈసెట్ (ECET) పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ మే 15న నిర్వహించనుంది. అలాగే మూడేళ్ల, ఐదేళ్ల లా కోర్సుల కోసం టీజీ లాసెట్, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల కోసం టీజీ పీజీఎల్‌సెట్ పరీక్షలను కూడా ఉస్మానియా యూనివర్సిటీ మే 18న నిర్వహించనుంది.
ఇక ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మసీ, తదితర పీజీ టెక్నికల్ కోర్సుల కోసం పీజీఈసెట్ (PGECET) పరీక్షలను జేఎన్‌టీయూ మే 28 నుంచి 31 వరకు నిర్వహించనుంది. శారీరక విద్య కోర్సులైన బీపీడీ, యూజీ డీపీఈడీ ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ పీఈసెట్ (PECET) ఫిజికల్ ఎఫిషియెన్సీ, స్కిల్ టెస్టులను శాతవాహన యూనివర్సిటీ మే 31 నుంచి జూన్ 3 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలు, నోటిఫికేషన్లు అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు ఉన్నత విద్యా మండలి అధికారులు తెలిపారు.


