కలం, నిజామాబాద్ బ్యూరో: డీసీసీబీ (DCCB), సహకార సంఘాల పాలకవర్గాల పదవులను (Cooperative Posts) ప్రభుత్వమే నామినేట్ చేయనుందా..? ఎన్నికలు చేతులెత్తే విధానానికి స్వస్తి చెప్పనుందా..? పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మార్కెట్ కమిటీ పాలకవర్గాల పదవుల మాదిరిగా సహకార పదవులను కూడా నామినేటెడ్ విధానంలోనే భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార పార్టీ నాయకులకు పదవుల పంపకంలో కలిసివస్తుందని కీలక నాయకులు అంటున్నారు. డిసిసిబి పీఏసీఎస్ టెస్కాబ్ ల పాలకవర్గాలు రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆరు నెలల్లోపు ప్రక్షాళన చేసే వరకూ తదుపరి ప్రత్యేక అధికారులను ఇన్ చార్జులుగా నియమించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే సహకార ఎన్నికలకు కూడా ప్రభుత్వం రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది.
పంచాయతీ ఫలితాల ప్రభావమేనా..
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో అనేక జిల్లాల్లో కాంగ్రెస్ సర్కార్ ఆశించిన మేర ఫలితాలు రాలేదు. దీంతో వాటికి ఎమ్మెల్యేలు మంత్రులను బాధ్యులుగా చేసినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న అభిప్రాయంలో ఉంది. సర్పంచ్ ఫలితాల ప్రభావమో లేక వ్యూహమో కానీ ఇక గ్రామ స్థాయిలో ఉన్న సహకార సొసైటీలు మొదలు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు వరకూ ఎన్నికలు ఎంపిక విధానం విషయంలో ప్రభుత్వం కొత్త ఆలోచనలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఒకవేళ నిర్ణయం మారితే ఆ పదవులకు(Cooperative Posts) ఎన్నికలు లేకుండా నామినేట్ పద్ధతిలో చైర్మన్లు డైరెక్టర్లను ప్రభుత్వం నియమించనున్నది.
ప్రక్షాళన దిశగా అడుగులు..
గతంలో రైతులు డైరెక్టర్లను ఎన్నుకోవడం ఆపై వారు చైర్మన్ ను ఎంపిక చేసే పద్ధతి ఉండేది. అయితే తాజా రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఎన్నికల ప్రక్రియను పక్కనపెట్టి ప్రభుత్వమే డైరెక్టర్లను చైర్మన్లను నేరుగా నామినేట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం రెండు జిల్లాల్లో 142 సహకార సొసైటీలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఒక డిసిసిబి ఉంది. నిజామాబాద్ జిల్లాలో 89, కామారెడ్డి జిల్లాలో 54 మొత్తం ఉమ్మడి జిల్లాలో 142 సహకార సొసైటీలు ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 905 సహకార సంఘాలు 9 డిసిసిబి(DCCB)లు టెస్కాబ్ పాలకవర్గాలు ఉండగా కొత్త జిల్లాలు కొత్త మండలాలకు అనుగుణంగా డిసిసిబిలు సహకార సంఘాలు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్బీఐ నిబంధనలు..
డీసీసీబీలను కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేస్తారని పలువురు భావిస్తున్నారు. కానీ ఆర్బిఐ మాత్రం ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఉమ్మడి జిల్లాల్లోనే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్యాంకు టర్నోవర్ విషయంలో తక్కువగా ఉండొద్దనే నిబంధన మేరకు ఆర్బీఐ ఈ విషయంలో కచ్చితంగా వ్యవహరిస్తోంది. కాబట్టి ప్రభుత్వం నిర్ణయం ఎలా ఉంటుందో అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు నామినేటెట్ పద్ధతిలో అన్ని పదవులు భర్తీ చేస్తే అది తమకు అనుకూలిస్తుందని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు.
Read Also: తెలంగాణ సర్పంచ్ కు కేంద్రమంత్రి సన్మానం
Follow Us On: Youtube


