epaper
Sunday, March 1, 2026
epaper

మైలేజ్ కోసం మనమేం చేద్దాం.. ‘లిక్కర్’ తీర్పుపై గులాబీ మల్లగుల్లాలు

కలం, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో (Delhi Liquor Scam) రౌస్ ఎవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పు గులాబీ పార్టీలో సరికొత్త చర్చకు దారితీసింది. ఈ తీర్పు వచ్చినరోజే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KCR) ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లి కేసీఆర్‌తో (KCR) చర్చించారు. ఈ చర్చల్లో ఏం నిర్ణయం జరిగిందనేది గోప్యం. కానీ ఈ తీర్పును బీఆర్ఎస్‌కు (BRS) అనుకూలంగా అన్వయించుకోవడంపై చర్చ మాత్రం ఆ పార్టీ లీడర్లలో మొదలైంది. కేజ్రీవాల్‌ను, కేసీఆర్‌ను రాజకీయంగా ఢీకొట్టలేకనే అప్పట్లో బీజేపీ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని, అందుకు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను ఎరగా వాడుకున్నారన్నది బీఆర్ఎస్ నేతల వాదన. ఇప్పుడు పార్టీకి కవిత దూరం కావడంతో ఆమెకు వచ్చిన మైలేజ్‌ను బీఆర్ఎస్ వాడుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ విషయాన్ని పొలిటికల్‌గా ఎలా వాడుకోవాలన్న అంశంలో గులాబీ లీడర్లు మల్లగుల్లాలు పడుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు.. BRS ఆరోపణ :

ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ స్కామే కాదు.. అసలు అవినీతే జరగలేదు.. ఎన్ని ఆరోపణలు చేసినా ఒక్క పైసా కూడా పట్టుకోలేకపోయారు.. ఇది బీజేపీ రాజకీయ కుట్ర.. అంటూ అప్పట్లో కేసీఆర్ కామెంట్ చేశారు. రౌస్ ఎవెన్యూ కోర్టు మూడున్నరేళ్ల విచారణ తర్వాత సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను కొట్టేసి మొత్తం 23 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించడంతో అప్పటి కేసీఆర్ మాటలను బీఆర్ఎస్ ఇప్పుడు హైలైట్ చేస్తున్నది. కేజ్రీవాల్, కేసీఆర్‌ను రాజకీయంగా బద్నాం చేయడానికి కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆడిన నాటకమన్నది ఇప్పుడు బీఆర్ఎస్ లేవనెత్తాలనుకుంటున్న వాదన. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీపై తొలుత ఫిర్యాదు చేసింది ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు చౌదరి అనిల్ కుమార్ అనే అంశాన్ని తెరపైకి తేనున్నది.

కేజ్రీవాల్ ప్రస్తావన వర్కవుట్ అయ్యేనా? :

రాజకీయంగా ఢీకొట్టలేనందుకే కేజ్రీవాల్, కేసీఆర్‌పై రాజకీయ కక్షతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ పేరుతో బీజేపీ నాటకాన్ని తెరమీదకు తెచ్చిందన్నది బీఆర్ఎస్ ఆరోపణ. కేసీఆర్‌తో పాటు కేజ్రీవాల్‌ను ప్రస్తావిస్తే తెలంగాణ ప్రజలకు ఏ మేరకు కనెక్ట్ అవుతారన్న సందేహం కూడా లేకపోలేదు. బీఆర్ఎస్‌ను పొలిటికల్‌గా దెబ్బకొట్టేందుకు బీజేపీని టార్గెట్ చేసేందుకు దీన్ని ప్రస్తావించాలన్నది గులాబీ నేతల ఆలోచన. కవితను అరెస్టు చేసే సమయానికి ఆమె బీఆర్ఎస్‌లో ఉన్నందున బీఆర్ఎస్ లాజిక్ పనిచేసింది. కానీ ఇప్పుడు ఆమె సొంత పార్టీ ప్రయత్నాల్లో ఉండడంతో ఈ కేసును పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకోవడంలో బీఆర్ఎస్‌కు చిక్కులున్నాయి. కేజ్రీవాల్‌ ప్రస్తావన తెలంగాణలో వర్కవుట్ కాకపోవడం, కవితను ప్రస్తావిద్దామనుకుంటే ఆమెకు బీఆర్ఎస్‌తో సంబంధం లేకపోవడం.. ఇలాంటి చిక్కులతో బీఆర్ఎస్ ఎలాంటి వైఖరి తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

ఇక నుంచి కవిత వర్సెస్ కేటీఆర్? :

పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్ అయినప్పటికీ యాక్టివ్‌గా లేకపోవడంతో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. లిక్కర్ కేసుపై రౌస్ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువడిన రోజున కవిత వర్సెస్ కేటీఆర్ పొలిటికల్ ఫైట్ మొదలైంది. పార్టీ ఓటమికి కారణం ఆమెపై లిక్కర్ స్కామ్ ఆరోపణలేనని కేటీఆర్ పరోక్ష కామెంట్లకు కవిత స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కవితకు క్లీన్ చిట్ రావడంతో ఏకకాలంలో బీజేపీ, బీఆర్ఎస్‌లపై ఆమె విరుచుకుపడే అవకాశమున్నది. ఏ తప్పూ చేయకున్నా బీజేపీ తనను ఐదు నెలలకు పైగా జైల్లో పెట్టిందని బీజేపీపై ఘాటుగానే విమర్శలు చేసే అవకాశమున్నది. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి అసలు కారణాలను మరుగున పెట్టి లిక్కర్ స్కామ్ ఆరోపణలతో వ్యక్తిగా తనను టార్గెట్ చేస్తున్నదంటూ బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యే అవకాశమున్నది.

Read Also: నైటుకు రేటు ఎంత అని అడుగుతారా.. ట్రోలర్లపై రేణు దేశాయ్ ఫైర్!

Follow Us On: Youtube

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!