కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) మంజూరుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో 2.50 లక్షల మంది పేద కుటుంబాలకు ప్రయోజనం కలగబోతుంది. ప్రతి నియోజకవర్గానికి 2 వేల చొప్పున ఇళ్లను మంజూరు చేయాలని నిర్ణయించింది. అలాగే, ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించి గోడలు, శ్లాబు దశలో నిలిచిపోయిన వాటిని కూడా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకుంది. పునాదులు పూర్తయి గోడలు, శ్లాబు పడని ఇళ్లకు రూ.3 లక్షలు, గోడలు పూర్తయి శ్లాబు నిలిచిపోయిన ఇళ్లకు రూ.2 లక్షలు చొప్పున అందించబోతున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసేందుకు నియోజకవర్గానికి 500 ఇళ్లకు చొప్పున నిధులు కేటాయిస్తూ తీర్మానించింది.
జూన్ 2న సీఎం సహా మంత్రులు కొఠారి గ్రామానికి..
తొలి విడతలో నిర్మాణం ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్లలో జూన్ రెండు నాటికి దాదాపు లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలు చేయించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం కొఠారి గ్రామంలో కొలాం ఆదివాసీలకు ప్రభుత్వం కట్టించిన 28 ఇందిరమ్మ ఇళ్లను జూన్ 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర మంత్రి వర్గమంతా వెళ్లి ప్రారంభించాలని నిర్ణయించడం గమనార్హం.
గుడిసెవాసులకు ఇందిరమ్మ ఇళ్లు..
రాష్ట్రంలో వివిధ దఫాలుగా చేసిన సర్వేల ప్రకారం 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివాసం ఉంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వెంటనే ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందించాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే, హైదరాబాద్ మహానగరం క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో అల్పాదాయ వర్గాల వారి కోసం (LIG) లక్ష ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించింది.
గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్లు..
2027 జూన్ 26వ తేదీ నుంచి జులై 7వ తేదీ వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు రూ.1000 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఆమోదం తెలిపింది. తొలి విడతగా రూ.300 కోట్లు మంజూరుకు క్యాబినెట్ అంగీకారం తెలిపింది. అలాగే, రాష్ట్రంలోని డీసీఎంలను మార్క్ ఫెడ్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది. TGRICని (తెలంగాణ రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) హాకాలో విలినం చేయనుంది.
పాలమూరు–రంగారెడ్డికి రూ.587 కోట్లు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం భూ సేకరణ, పునరావాసం, మౌలిక వసతుల సదుపాయాల కల్పనకు రూ.587 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే, విద్యుత్ పంపిణీ, మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న RDSSలో చేరేందుకు తెలంగాణ డిస్కంలు తయారు చేసిన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030కి ఆమోదం..
తెలంగాణను 2030 నాటికి ప్రపంచంలోని టాప్ 5 లైఫ్ సైన్సెస్ హబ్‌ల్లో ఒకటిగా నిలపాలనేదే ఉద్దేశంతో నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–2030కి కేబినెట్ ఆమోదించింది. దావోస్ వరల్డ్ ఎకానమిక్ ఫోరంలోనే ఈ పాలసీని లాంఛనంగా ఆవిష్కరించారు. వచ్చే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు, 25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆకర్షించాలనేది ఈ పాలసీ లక్ష్యం. ఇప్పటివరకు ఎక్కువగా తయారీ మీద దృష్టి ఉంటే, ఇక నుంచి విలువైన ఇన్నోవేషన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని ఈ పాలసీ సూచిస్తోంది. రీసెర్చ్ అండ్ డెవెలప్మెంట్ (R&D) యూనిట్లను కూడా పరిశ్రమలుగా గుర్తించే విధంగా ఈ పాలసీలో మార్పు తీసుకొస్తున్నట్లు కేబినెట్ పేర్కొంది.

