కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కలెక్టర్ (Nirmal Collector) గా బాధ్యతలు స్వీకరించిన భవేష్ మిశ్రా (Bhavesh Mishra) జిల్లా పరిపాలనలో పారదర్శకత, జవాబుదారీతనానికి ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న లోపాలను గుర్తించి వాటిని సరిదిద్దడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా చర్యలు చేపడుతున్నారు. అధికారుల పనితీరును మెరుగుపర్చేందుకు నిరంతరం సూచనలు చేస్తూనే, క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలోని 18 మండలాలు, మూడు మున్సిపాలిటీలు, సుమారు 400 గ్రామపంచాయతీలపై ప్రత్యేక దృష్టి సారించిన కలెక్టర్ ప్రతి గ్రామంలో నెలకొన్న సమస్యలు, ప్రజల అవసరాలు, ప్రభుత్వానికి నివేదించాల్సిన అంశాలను స్వయంగా పరిశీలిస్తున్నారు. సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోంది. ఇటీవల ముగిసిన మొక్కజొన్న, వరి, జొన్న ధాన్యం కొనుగోళ్లను సమర్థవంతంగా పూర్తి చేయడంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. దాదాపు రెండు నెలల పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ నిర్వహిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయించడంతో రైతుల ప్రశంసలు అందుకున్నారు.
ఎఫ్‌ఆర్‌ఎస్ అమలుపై ప్రత్యేక దృష్టి
జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు, విధి నిర్వహణలో పారదర్శకత కోసం ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ (ఎఫ్‌ఆర్‌ఎస్) అమలుపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. జిల్లాలోని 42 ప్రభుత్వ శాఖల్లో జిల్లా అధికారుల నుంచి అటెండర్ స్థాయి వరకు ఉద్యోగుల హాజరును ప్రతిరోజూ ఆన్‌లైన్‌లో సమీక్షిస్తున్నారు. సకాలంలో విధులకు హాజరవుతున్నారా, విధి నిర్వహణ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారా, అనుమతి లేకుండా బయటకు వెళ్తున్నారా వంటి అంశాలపై సమగ్ర నివేదికలను సంబంధిత అధికారుల సమక్షంలోనే పరిశీలిస్తున్నారు.
అలాగే ప్రజావాణిలో వచ్చిన వినతులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, సాధ్యం కాని సందర్భాల్లో కారణాలను నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల పురోగతిపై రోజువారీ నివేదికలు సమర్పించాలని సూచిస్తూ, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, వెంకటేశ్వర్లు, భైంసా సబ్‌కలెక్టర్ సంకేత్ కుమార్‌లను కూడా క్షేత్రస్థాయి పర్యవేక్షణకు ఆదేశించారు.
ఇప్పటికే జిల్లా ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కేజీబీవీలు, గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు, విత్తనాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేసి ప్రభుత్వ సేవల్లో నాణ్యత, పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. సమయపాలనకు ప్రాధాన్యం ఇస్తూ సమావేశాలు, సమీక్షలను నిర్ణీత సమయంలో పూర్తి చేయడమే కాకుండా, మంచి పనితీరు కనబరిచిన అధికారులను అభినందిస్తూ, నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులను హెచ్చరిస్తున్నారు.
‘మరో అహ్మద్ బాబు’గా సోషల్ మీడియాలో ప్రచారం
2014లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన అహ్మద్ బాబు పరిపాలనలో తీసుకొచ్చిన క్రమశిక్షణ, ఆకస్మిక తనిఖీలు, పారదర్శకతకు అప్పట్లో మంచి గుర్తింపు లభించింది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) కూడా అదే తరహాలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారుల పనితీరును మెరుగుపర్చే చర్యలు చేపడుతున్నారనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ చేపడుతున్న పరిపాలనా సంస్కరణలు ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడంలో దోహదపడతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read Also: ‘వివరణ ఇచ్చేదే లేదు’.. మంత్రి సురేఖకు కడియం కౌంటర్!
Follow Us On: Sharechat

