ఎరువుల పంపిణీ.. మహిళా సంఘాలకు కీలక బాధ్యతలు!

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలోని రైతాంగానికి ఎరువుల కొరత లేకుండా, సకాలంలో, సులభంగా ఎరువులు అందేలా చూసేందుకు ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో ఎరువుల పంపిణీ (Fertilizer Distribution) బాధ్యతలను మహిళా స్వయంసహాయక సంఘాలకు (SHGs) అప్పగించాలని యోచిస్తోంది. దీనివల్ల రైతులకు స్థానికంగానే ఎరువులు లభించడమే కాకుండా, మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి కూడా పెద్దపీట వేసినట్లవుతుందని అధికారులు భావిస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 4.67 లక్షల మహిళా సంఘాలు యాక్టివ్‌గా ఉన్నాయి. వీటిలో వ్యాపార నిర్వహణ సామర్థ్యం, మౌలిక వసతులు ఉన్న కొన్ని ఎంపిక చేసిన సంఘాలకు ఈ బాధ్యతలను అప్పగించనున్నారు. ఈ పక్రియలో భాగంగా ఎంపికైన సంఘాలకు ప్రభుత్వం అధికారికంగా ఎరువుల విక్రయ లైసెన్సులను మంజూరు చేస్తుంది. అంతేకాకుండా ఎరువుల నిల్వ, రికార్డుల నిర్వహణ, విక్రయాల ప్రక్రియపై ఆయా సంఘాల సభ్యులకు ప్రత్యేక శిక్షణ కూడా ఇవ్వనున్నారు.

ఈ విక్రయాల కోసం మహిళా సంఘాలు తమ స్వంత భవనాలనే నిల్వ కేంద్రాలుగా, అవుట్‌లెట్లుగా ఉపయోగించుకోనున్నాయి. దీనివల్ల నిల్వ ఖర్చులు తగ్గడంతో పాటు రైతులకు నమ్మకమైన సేవలు అందుతాయి. నకిలీ ఎరువుల నియంత్రణకు, సకాలంలో సరఫరాకు ఈ నిర్ణయం ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసి, ప్రయోగాత్మకంగా కొన్ని గ్రామాల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు.

Read Also: ములుగు ఫారెస్ట్రీ కోర్సు దరఖాస్తులు ప్రారంభం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>