కలం, వెబ్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) బ్యాటింగ్ (Batting) చూస్తే బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్తారు. ఆ విధ్వంసకర ఆటకు కారణం తన స్కూల్ రోజులే అని సూర్యకుమార్ చెప్పాడు. తన దూకుడైన ఆట వెనుక స్కూల్ ప్రిన్సిపాల్ పాత్ర చాలా కీలకమని ఆయన వెల్లడించాడు. “అంతా మా ప్రిన్సిపాల్ చేశాడు” అంటూ సూర్య చేసిన వ్యాఖ్య ఇప్పుడు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
గౌహతిలో జరిగిన మూడో టీ20లో భారత్ న్యూజిలాండ్‌పై 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఫలితంతో ఐదు టీ20ల సిరీస్‌ను భారత్ 3-0తో ముందుగానే కైవసం చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తరువాత మాట్లాడిన సూర్య(Suryakumar Yadav).. ఈ విజయం జట్టు అంతా కలిసే సాధించిందని చెప్పాడు. స్కూల్ రోజుల్లో కూడా ఇలానే దూకుడుగా ఆడేవాడివా అనే ప్రశ్నకు సూర్య చిరునవ్వుతో స్పందించాడు. “మా స్కూల్ ప్రిన్సిపాల్ నాకు క్రికెట్ ఆడే స్వేచ్ఛ ఇచ్చారు. పరీక్షల సమయంలో కూడా అవసరమైనప్పుడు సెలవులు ఇచ్చేవారు. ఆ సమయాన్ని నేను మైదానంలో గడిపేవాడిని. అక్కడే ఆటపై అవగాహన పెరిగింది” అని గుర్తు చేసుకున్నాడు.
లక్ష్య చేధన గురించి కూడా సూర్య స్పష్టంగా చెప్పాడు. ముందుగా బ్యాటింగ్ చేసినా, ఛేజింగ్ చేసినా అదే దూకుడుతో ఆడాలని జట్టు నిర్ణయించుకుందని వివరించాడు. మొదట్లోనే వికెట్లు పడిపోయినా ఎలా ముందుకు వెళ్లాలో తాము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. టీ20 క్రికెట్ తదుపరి స్థాయికి చేరాలంటే అగ్రెషన్ తప్పనిసరి అని అభిప్రాయపడ్డాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు తన పని చాలా ఈజీ చేశారని సూర్య ప్రశంసలు కురిపించాడు. జట్టు నమ్మకంతోనే ఇలాంటి ఫలితాలు వస్తున్నాయని స్పష్టం చేశాడు.


