కలం, వెబ్ డెస్క్ : బిర్యానీ ప్రియులు జాగ్రత్త ! తాజా బిర్యానీ అని మీరు ఆర్డర్ చేస్తున్న ఆహారం రోజుల నాటిది కావచ్చు. నగరంలోని బంజారాహిల్స్ ప్రాంతంలో వెలుగుచూసిన ఓ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. మూడు రోజుల క్రితం వండిన బిర్యానీని (Stale Biryani) ఫ్రిడ్జ్‌లలో దాచి, కస్టమర్లకు వేడి చేసి విక్రయిస్తున్న వైనాన్ని పోలీసులు బట్టబయలు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. జీడిమెట్ల ప్రాంతంలో ఈ బిర్యానీని భారీ స్థాయిలో తయారు చేసి, అక్కడి నుండి బంజారాహిల్స్‌లోని ఒక ప్రముఖ రెస్టారెంట్‌కు తరలిస్తున్నారు. అక్కడ నిల్వ ఉంచిన పాత బిర్యానీ (Stale Biryani)ని ఓవెన్‌లో వేడి చేసి, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ద్వారా కస్టమర్లకు అంటగడుతున్నారు. దీనిపై అనుమానం వచ్చిన కొందరు కస్టమర్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.
రంగంలోకి దిగిన బంజారాహిల్స్ పోలీసులు సదరు రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న ఫ్రిడ్జ్‌లను తెరిచి చూసిన అధికారులకు వందలాది బిర్యానీ ప్యాకెట్లు కనిపించడంతో షాక్‌కు గురయ్యారు. అవన్నీ మూడు రోజుల క్రితం వండినవిగా ప్రాథమికంగా గుర్తించారు. ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న సదరు నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. బయట ఆహారం తీసుకునేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also: ‘తనను తాను ప్రేమించలేని వాడు.. ఇతరులను ప్రేమించలేరు’ ఇందులో వాస్తవం ఎంత?
Follow Us On : WhatsApp

