ఆడపిల్లల రక్షణ కోసం ఓ యువకుడు నడుం బిగించాడు. ఎముకలు కొరికే చలిలో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ యువకుడు ఢిల్లీ యాత్ర చేశాడు. సేవ్ గర్ల్ చైల్డ్(Save Girl Child) పేరిట ప్రత్యేకంగా ఓ విభాగం ఏర్పాటు చేయాలన్నది ఆ యువకుడి డిమాండ్. అందుకోసం దాదాపు 24 రోజులు కష్టపడి 1450 కిలోమీటర్లు సైకిల్ మీద ప్రయాణం చేశాడు. మధ్యలో ఆరోగ్య సమస్యలు వచ్చినా లెక్క చేయలేదు. తన నినాదాన్ని ఢిల్లీకి వినిపించాడు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలుసుకొని వినతిపత్రం సమర్పించాడు. త్వరలో ప్రధాని మోడీని కలవబోతున్నాడు. ఓ యువకుడు ఎవరు? ఆయనకు ఎందుకింత సామాజిక స్పృహ ఉందన్నది ఈ కథనంలో తెలుసుకుందాం.
నిజామాబాద్(Nizamabad) జిల్లాకు చెందిన శ్రీనివాస్‌కు సామాజిక స్పృహ ఎక్కువ. ఆడపిల్లలను బతికించాలన్నది ఆయన లక్ష్యం. అందుకోసం గతంలో ఎన్నో ప్రయత్నాలు చేశారు. తాజాగా సైకిల్ మీద ఢిల్లీ యాత్ర చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు. నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల మీదుగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాలను దాటుకొని ఢిల్లీకి వెళ్లారు. మధ్యలో ఎడమ కాలి నొప్పితో బాధపడ్డారు. అయినప్పటికీ లెక్క చేయకుండా నాగ్‌పూర్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. అక్కడి నుంచి ఢిల్లీ 1000 కిలోమీటర్లపైనే ఉంటుంది. ఓ వైపు భయంకరమైన చలి ఉంది. అయినప్పటికీ లెక్క చేయకుండా సైకిల్ మీద తన ప్రయాణం కొనసాగించారు శ్రీనివాస్. అయ్యప్ప దీక్షలో ఉన్న శ్రీనివాస్ జాతీయ రహదారుల మధ్య చలిగాలుల్లో పెద్ద సాహసమే చేశారు.
ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని కలసి సేవ్ గర్ల్ చైల్డ్(Save Girl Child) డిపార్ట్ మెంట్‌ను ఏర్పాటు చేయాలన్నది ఆయన డిమాండ్. 24 రోజులపాటు సైకిల్‌పై ప్రయాణించి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి తన సైకిల్ యాత్ర ఉద్దేశ్యం వివరించారు. ప్రధాని మోడీని కలసి సేవ్ గర్ల్ డిపార్ట్‌మెంట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటయ్యే చేయాలని కోరతానని చెప్పారు. ఇక ఆయన పట్టుదలకు మంత్రి కిషన్ రెడ్డి సైతం అభినందించారు.
గతంలోనూ శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లాలో సేవ్ గర్ల్ చైల్డ్ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఆ విభాగం ఏర్పాటైతే ఆడ పిల్లలకు పునర్జన్మ లభిస్తుందని ఆయన ఉద్దేశం. పుట్టిన ఆడ పిల్లల విషయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే తల్లిదండ్రులకు చట్టపరమైన చర్యలు తీసుకునే వీలుంటుంది. ఆడపిల్లలను కాపాడుకోవాలంటూ సేవ్ గర్ల్ పేరిట ప్రత్యేకంగా ఓ ప్రభుత్వ విభాగం ఏర్పాటు చేయాలన్నది ఆయన డిమాండ్. భ్రూణ హత్యల పరంపర కొనసాగితే 2050నాటికి అమ్మాయిలు మ్యూజియంలో బొమ్మ లాగా చూడాల్సిన ప్రమాదం ఏర్పడుతుందని ఆయన హెచ్చరిస్తున్నారు.
శ్రీనివాస్‌కు కూడా భార్యాపిల్లలు ఉన్నారు. ఆయన వారిని వదిలేసి దేశంలోని ఆడపిల్లల రక్షణ కోసం సాహసయాత్ర చేశారు. శ్రీనివాస్ సైకిల్ యాత్ర ఉద్దేశం చూసి తెలుసుకొని దారి పొడవునా అయ్యప్ప స్వాములు జనాలు పలు షాపుల యజమానులు ఆయన్ను అభినందించారు… ఆశీర్వదించారు.
Read Also: అర్బన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్‌లపై కేంద్రం క్లారిటీ
Follow Us On: Pinterest


