కలం డెస్క్ : దేశవ్యాప్తంగా అర్బన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్స్ (Urban Land Registrations) విధానంలో సమూల మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతున్నది. ఇప్పటికే కొన్ని పట్టణాల్లో పైలట్ పద్ధతిలో అమలు చేసిన విధానాన్ని సెకండ్ ఫేజ్‌లో భాగంగా మరికొన్ని నగరాలు, పట్టణాల్లో అమలు చేయాలనుకుంటున్నది. ఇంతకాలం వాడిన మాన్యువల్ స్కెచ్ మ్యాప్ (Sketch Map)ల స్థానంలో ఇక నుంచి జీఐఎస్ (జియోగ్రాఫిక్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్ – GIS) విధానాన్ని తప్పనిసరి చేయాలనుకుంటున్నది. అన్ని రాష్ట్రాల్లో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ విధానాన్ని కొత్త టెక్నాలజీని వాడి సంపూర్ణంగా ప్రక్షాళన చేసేవైపు అడుగులేస్తున్నది. ప్రతీ ప్రాపర్టీకి కచ్చితమైన అక్షాంశ (Latitude), రేఖాంశాల (Longitude) కోఆర్డినేట్స్ ఉండాలని కేంద్ర రెవెన్యూ శాఖలోని భూ రికార్డుల విభాగం కార్యదర్శి మనోజ్ జోషి స్పష్టం చేశారు.
ప్రాపర్టీ రిజిస్ట్రేషనలన్నింటిపై జీఐఎస్ మస్ట్ :
దేశంలోని నగరాలు, పట్టణాల్లో ఇప్పటికీ చాలా ప్రాపర్టీలకు సరైన డాక్యుమెంట్లు లేవని, దీంతో వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయని గుర్తుచేసిన మనోజ్ జోషి… ఇకపైన రిజిస్ట్రేషన్ లావాదేవీలన్నీ ఒక బ్లాక్ బాక్స్ లాగా ఉండాలన్నారు. నేషనల్ జియో స్పేషియల్ నాలెడ్జి బేస్డ్ లాండ్ సర్వే ఆఫ్ అర్బన్ హ్యాబిటేషన్స్ అనే సదస్సులో ఆయన ప్రసంగిస్తూ, భూములకు సంబంధించిన అన్ని లావాదేవీల్లో జీఐఎస్ వివరాలు తప్పనిసరిగా ఉండాల్సిందేనని అన్నారు. చాలా సందర్భాల్లో భూములకు సంబంధించిన పత్రాలు డిజిటల్ రూపంలో ఉంటున్నా అవి జీఐఎస్ డాటాలోని ఏ మ్యాప్‌తోనూ కనెక్ట్ కావడంలేదన్నారు. ఈ లోపాలన్నింటినీ సరిదిద్ది జీఐఎస్‌తో పూర్తిస్థాయిలో అనుసంధానం చేస్తే భూముల వివాదాలు తగ్గడంతో పాటు ట్రాన్సపరెన్సీ పెరుగుతుందన్నారు. దేశంలోని అన్ని అర్బన్ భూములకు సరిహద్దులు ఒకేలా ఉండేలా ఏకీకృత విధానం రిజిస్ట్రేషన్ సమయంలోనే అమలు చేయవచ్చన్నారు.
చాలామంది దగ్గర డాక్యుమెంట్లే లేవు :
అర్బన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్(Urban Land Registrations) విషయంలో చాలా మంది ప్రాపర్టీ ఓనర్ల దగ్గర సరైన పత్రాలే లేవని, ఇది ఆచరణాత్మక సమస్య అని మనోజ్ జోషి కామెంట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లోని పట్టణ ప్రాపర్టీలలో దాదాపు సగం మంది ఓనర్ల దగ్గర రిజిస్టర్డ్ సేల్ డీడ్స్, పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించినట్లు ధృవీకరించే సర్టిఫికెట్లు, రికార్డ్ ఆఫ్ రైట్స్ రిజిస్టర్‌లో వివరాల నమోదు.. ఇలాంటి హక్కు పత్రాలు లేవని గుర్తుచేశారు. ఇటీవలి కాలంలో రకరకాల పేర్లతో అనధికార కాలనీలు, లే-ఔట్‌లు పుట్టుకొస్తున్నాయని, రెసిడెన్షియల్ ప్లాట్లు అని చెప్పుకుంటున్నా సంబంధిత ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతి పత్రాలు లేవని, ఓనర్ల దగ్గర ఉన్న డాక్యుమెంట్ల వివరాలు చెల్లుబాటు కావడంలేదని గుర్తుచేశారు.
డిజిటల్ టెక్నాలజీపై బడ్జెట్‌లో క్లారిటీ :
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా అర్బన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ లావాదేవీల్లోని చిక్కులను పరిగణనలోకి తీసుకుని ‘నక్ష’ (NAKSHA) ప్రోగ్రామ్ గురించి ప్రస్తావించారని, వివిధ రాష్ట్రాల్లోని 157 చిన్న పట్టణాల్లో సెకండ్ ఫేజ్ పైలట్ ప్రాజెక్టుగా ఈ ప్రోగ్రామ్ కొనసాగుతున్నదని మనోజ్ జోషి గుర్తుచేశారు. సగటున రెండు లక్షల మంది జనాభా ఉన్న 35 చ.కి.మీ. విస్తీర్ణంలోని పట్టణాలను ఎంపిక చేసినట్లు వివరించారు. ఈ పట్టణాల్లో జీఐఎస్ బేస్డ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ వైపు మార్పులు జరిగేలా ప్రక్షాళన మొదలైందన్నారు. అక్షాంశ, రేఖాంశాలు పకడ్బందీగా నమోదు చేసేందుకు వీలుగా ప్రస్తుతం మాన్యువల్‌గా భూముల సర్వే విధానం అమలవుతున్నదని, దీన్ స్థానంలో రోవర్‌లను కొనుగోలు చేస్తే ఎక్కువ ఫలితం ఉంటుందన్నారు. పరికరాల ధర కాస్త ఎక్కువే అయినా భారీ సంఖ్యలో సర్వేయర్ల అవసరాన్ని తగ్గించడం ద్వారా ప్రభుత్వం ఖర్చును తగ్గించుకోవచ్చన్నారు. అనేక రాష్ట్రాలు ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ వ్యవస్థను కాలం చెల్లిన విధానాలు, టెక్నాలజీతోనే నెట్టుకొస్తున్నాయని, జీఐఎస్ ప్లాట్‌ఫామ్‌కు కనెక్ట్ కావాలని సూచించారు. రోవర్ సర్వే పరికరాల కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని రాష్ట్రాలు గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నారు.
Read Also: బీజేపీ నేషనల్ చీఫ్‌గా ధర్మేంద్ర ప్రదాన్?
Follow Us on: Facebook


