కలం, వెబ్ డెస్క్: పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender)కు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Telangana Legislative Assembly Speaker) నోటీసులు జారీ చేశారు. జనవరి 30న విచారణకు రావాలని ఆదేశించారు. దానం నాగేందర్ గతంలో పలుమార్లు మీడియాతో మాట్లాడుతూ.. తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు స్పష్టంగా ప్రకటించారు. అంతేకాకుండా ఆయన సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేశారు. దీంతో స్పీకర్ నోటీసులకు ప్రాధాన్యం ఏర్పడింది. మిగిలిన ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పిటిషన్లను (Disqualification Petitions) స్పీకర్ కొట్టేశారు. వారు పార్టీ మారారు అని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అయితే దానం విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నది ఆసక్తి కరంగా మారింది. ఒకవేళ దానం నాగేందర్ (Danam Nagender)ను అనర్హుడిగా ప్రకటిస్తే అప్పుడు ఈ స్థానంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.
సుప్రీం ఆదేశాలతో కదిలిక
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను నిర్ణీత కాలంలో పరిష్కరించాలంటూ అత్యున్నత న్యాయస్థానం గతంలో స్పీకర్‌ను ఆదేశించింది. దీంతో స్పీకర్ ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు. వారు పార్టీ మారారు అని చెప్పేందుకు ఎటువంటి ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను కొట్టేశారు. మరి దానం నాగేందర్ విషయంలో ఏం జరుగుతుందో వేచి చూడాలి.


