epaper
Wednesday, January 28, 2026
spot_img
epaper

అజిత్ పవార్.. కల తీరకుండానే కనుమరుగు

కలం, వెబ్​డెస్క్​: నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానం.. అనేక నాటకీయ పరిణామాలకు కేరాఫ్​ అడ్రస్​.. ఆరుసార్లు డిప్యూటీ సీఎం.. వేర్వేరు పార్టీలతో కలసి ప్రయాణం..  వెరసి మహారాష్ట్ర రాజకీయాల్లో విలక్షణ నేత అజిత్​ పవార్(66)​ (Ajit Pawar). రాజకీయాల్లో తనకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు లేరని చెప్పే అజిత్​​.. ముఖ్యమంత్రి కావాలనే తన కోరిక తీరకుండానే కనుమరుగయ్యారు. జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళుతూ ఈ ఉదయం(28 జనవరి, 2026) విమాన ప్రమాదంలో మరణించారు. ఇది మహారాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపు, ఊహించని మలుపు.

అంచెలంచెలుగా ఎదుగుతూ..

మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లా దేవ్​లాలి ప్రవరలో 1959, జులై 22న జన్మించిన అజిత్​ అనంతరావ్​ పవార్(Ajit Pawar) ​రాజకీయ ప్రస్థానం 1982లో ప్రారంభమైంది. సొంత బాబాయ్​ శరద్​ పవార్​ బాటలో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన ఆశీర్వాదాలతో మొదట కోఆపరేటివ్​ షుగర్​ ఫ్యాక్టరీ బోర్డు మెంబర్​ అయ్యారు. ఆ తర్వాత పుణే జిల్లా సహకార బ్యాంక్​ (పీడీసీ) చైర్మన్​గా ఎన్నికయ్యారు. పదహారేళ్ల పాటు ఇదే పదవిలో నిరాటంకంగా కొనసాగారు. ఆ తరువాత ఛత్రపతి షుగర్​ ఫ్యాక్టరీ డైరెక్టర్​గా పనిచేశారు. అనంతరం ఛత్రపతి బజార్​కు అధ్యక్షుడయ్యారు. అదే సమయంలో పుణే జిల్లా వికాస్​ ప్రతిష్ఠాన్​కు ట్రస్టీగా కూడా పనిచేశారు. 1991లో బారామతి స్థానం నుంచి ఎంపీగా గెలిచి లోక్​సభలో అడుగుపెట్టారు. అయితే, నాలుగు నెలల్లోనే బాబాయ్​ శరద్​ పవార్ కోసం రాజీనామా చేశారు. ఆ స్థానం నుంచి పోటీ చేసిన శరద్​ పవార్​ గెలిచి అప్పటి ప్రధాని పీవీ మంత్రివర్గంలో రక్షణ మంత్రి అయ్యారు.

ఎనిమిది సార్లు ఎమ్మెల్యే.. ఆరుసార్లు డిప్యూటీ..

కేంద్ర రాజకీయాల్లో బాబాయ్​ శరద్​ పవార్​ వెళ్లడంతో ఖాళీ అయిన బారామతి అసెంబ్లీ స్థానం నుంచి 1991లో జరిగిన ఉప ఎన్నికలో ​గెలిచిన అజిత్ పవార్ ఆ తర్వాత తిరిగి చూసుకోలేదు. అనంతరం వరుసగా ఏడు సార్లు అదే స్థానం నుంచి మహారాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 91, 95 ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి ఎన్నికైన ఆయన.. ఆ తర్వాత నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ (NCP) నుంచి  విజయం సాధించారు. 1999లో ఎన్నికయ్యాక మొదటిసారి రాష్ట్ర మంత్రి అయ్యారు. విలాస్​రావ్​ దేశ్​ముఖ్​ మంత్రివర్గంలో నీటి పారుదల, గ్రామీణాభివృద్ధిశాఖలకు మంత్రిగా పనిచేశారు.2004లో గెలిచాక జలవనరుల శాఖ మంత్రి అయ్యారు. పృథ్వీరాజ్ ​చవాన్​ నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో 2010లో తొలిసారి డిప్యూటీ సీఎం అయ్యారు అజిత్​. అనంతరం మరో ఐదుసార్లు ఉపముఖ్యమంత్రి అయ్యారు.

బాబాయ్​తో విభేదాలు..

2019 అసెంబ్లీ ఎన్నికల్లో శరద్​ పవార్​ నేతృత్వంలోని ఎన్​సీపీకి అధిక స్థానాలు వచ్చాయి. అయినా, కాంగ్రెస్​కు సీఎం పదవి ఇవ్వడాన్ని అజిత్​​ జీర్ణించుకోలేకపోయారు. బాబాయ్​ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేశారు. విభేదాలు తీవ్రం కావడంతో ఎన్​సీపీ నుంచి బయటకు వచ్చారు. బీజేపీకి మద్దతు ఇచ్చారు. దాంతో బీజేపీ నుంచి దేవేంద్ర ఫడ్నవిస్​ ముఖ్యమంత్రి కాగా, అజిత్​ డిప్యూటీ సీఎం అయ్యారు.  అయితే, ఈ ప్రభుత్వం కేవలం మూడు రోజుల్లోనే కుప్పకూలింది. దీంతో మళ్లీ బాబాయ్​ చెంతన చేరారు అజిత్. అనంతరం శివసేన నేత ఉద్ధవ్​ఠాక్రేతో కలసి ఎన్​సీపీ ఏర్పాటుచేసిన మహా వికాస్​ ఆఘాడీ కూటమిలో పనిచేశారు. మళ్లీ డిప్యూటీ సీఎం అయ్యారు. రెండున్నరేళ్లలో ఈ ప్రభుత్వం కూలిపోయింది.

అనంతరం ఎన్​సీపీ నుంచి బయటకు వచ్చి బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమిలో చేరారు. 2022లో ఏక్​నాథ్​ షిండే సారథ్యంలో ఏర్పడిన మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం అయ్యారు. 2‌‌‌024లో జరిగిన ఎన్నికల్లో మహాయుతి మళ్లీ విజయం సాధించింది. ఈసారి అజిత్​ పవార్​కు సీఎం పీఠం దక్కుతుందని అందరూ భావించారు. అయితే, దేవేంద్ర ఫడ్నవిస్​ సీఎం కాగా, అజిత్​ మళ్లీ డిప్యూటీగానే మిగిలిపోయారు. అలా, వేర్వేరు కూటముల్లో (కాంగ్రెస్​–ఎన్​సీపీ; కాంగ్రెస్​–శివసేన–ఎన్​సీపీ; బీజేపీ–శివసేన–ఎన్​సీపీ) నుంచి ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి అయి రికార్డు సృష్టించారు.

మాస్​ లీడర్​..

మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్​ పవార్​ మాస్​ లీడర్​గా పేరు పొందారు. బాబాయ్​ అండతో రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటికీ అనేక సార్లు ఆయనతో విభేదించారు. వేరు పడ్డారు. మళ్లీ కలసి పోయారు. ఆ క్రమంలో సొంతంగా కేడర్​ పెంచుకున్నారు. తనకంటూ వర్గాన్ని ఏర్పాటుచేసుకున్నారు. 2022లో బాబాయ్​తో విభేదించాక తన వర్గం ఎమ్మెల్యేలతో కలసి వేరు కుంపటి పెట్టారు. అజిత్​ వైపే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉండడంతో పార్టీతోపాటు, గుర్తు కూడా అతనికే సొంతమైంది.

అయితే, గత లోక్​సభ ఎన్నికల్లో బారామతి స్థానం నుంచి బాబాయ్​ శరద్​ పవార్​ కూతురు సుప్రియా సూలేపై తన భార్యను పోటీకి నిలిపారు. ఆ ఎన్నికల్లో అజిత్​ సతీమణి ఓటమి చెందారు. అలా పోటీకి దించడం తప్పని తర్వాత అజిత్​ పశ్చాత్తాపపడ్డారు. కాగా, అర్ధరాత్రి డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయడం నుంచి అనేక నాటకీయ సంఘటనలకు కారణమైన అజిత్​ పవార్​ ఏనాటికైనా సీఎం కావాలని కలగన్నారు. ఆ కల తీరకుండానే విమాన ప్రమాదంలో అర్ధాంతరంగా నిష్క్రమించారు.

Read Also: అజిత్ పవార్ మృతి.. సీఎం ఫడ్నవీస్ భావోద్వేగ ట్వీట్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>