కలం, వెబ్ డెస్క్: సింగరేణి అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) విమర్శలు గుప్పించారు. సింగరేణిపై (Singareni) కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ తన ఆజమాయిషీని ప్రదర్శించలేదని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో సింగరేణి బోర్డు నిర్ణయాలు కేవలం నామమాత్రంగానే మిగిలాయని తెలిపారు.
నైనీ కోల్ బ్లాక్ టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లోపించిందని మంత్రి పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం గనులను సందర్శించిన తర్వాతే కంపెనీలు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు 17 కంపెనీలు ఫీల్డ్ విజిట్ చేసినప్పటికీ, యాజమాన్యం మాత్రం ఒక్క కంపెనీకి కూడా సర్టిఫికేట్ ఇవ్వలేదని ఆయన వెల్లడించారు. ఈ నెల 29తో టెండర్ల గడువు ముగియనున్నదని పేర్కొన్నారు.
రాష్ట్ర అభివృద్ధిలో సింగరేణి వెన్నెముక వంటిదని, కానీ గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం సంస్థను కష్టాల్లోకి నెట్టాయని కిషన్ రెడ్డి విమర్శించారు. మన్మోహన్ సింగ్ (Manmohan Singh) హయాంలో జరిగిన బొగ్గు కుంభకోణాలను ఆయన గుర్తు చేస్తూ, తెలంగాణలో గత ప్రభుత్వం తాడిచర్ల గనిని ఇతరులకు కట్టబెట్టిందని ఆరోపించారు. ఈ అక్రమాలన్నింటి వెనుక కేసీఆర్ కుటుంబ హస్తం ఉందని ఆయన ఆరోపించారు.
గతంలో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా నిషేధించిన బీఆర్ఎస్, ఇప్పుడు అదే సీబీఐ ఎంక్వైరీ అడగటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సింగరేణిని కాపాడుకునేందుకు కేంద్రం ఎల్లప్పుడూ సహకరించడానికి సిద్ధంగా ఉందని, అయితే పారదర్శకత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కిషన్ రెడ్డి (Kishan Reddy) తెలిపారు.
Read Also: ‘అన్న’లు వెళ్లిపోయారు.. ఆయుధాలు మిగిలాయి
Follow Us On : WhatsApp


