కలం, వెబ్ డెస్క్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లి చరిత్ర సృష్టించిన భారతీయ అంతరిక్షయాత్రికుడు శుభాంశు శుక్లాకు (Shubhanshu Shukla) అశోక్ చక్ర ప్రదానం చేయబోతున్నారు. దేశంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన వారికి ఈ అవార్డు దక్కుతూ ఉంటుంది. కాగా కేంద్ర ప్రభుత్వం శుభాంశు శుక్లాకు ఈ అవార్డు ఇవ్వబోతున్నది. ఈ పురస్కారానికి ఆయన పేరును కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసినట్టు సమాచారం. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందే ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
అంతరిక్ష మిషన్ సమయంలో శుభాంశు శుక్లా చూపిన అసాధారణ ధైర్యసాహసాలు, చాకచక్యం, బాధ్యతాయుతమైన పనితీరును గుర్తించి ఈ గౌరవాన్ని ప్రకటించినట్టు సమాచారం. ఆయన ఎక్సియం–4 (Axiom-4) మిషన్‌లో భాగంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. 2025 జూన్ 25న మరో ముగ్గురు అంతరిక్షయాత్రికులతో కలిసి ప్రయాణించిన ఆయన, జూలై 14న సురక్షితంగా భూమికి తిరిగి వచ్చారు. దాదాపు 20 రోజులు అంతరిక్షంలో గడిపారు.
ఈ మిషన్ సమయంలో బయోమెడికల్ సైన్స్, న్యూరో సైన్స్, వ్యవసాయం, అంతరిక్ష సాంకేతికత, ఆధునిక మెటీరియల్ సైన్స్ వంటి రంగాలకు సంబంధించిన 60కిపైగా కీలక శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించారు. ఇవి భవిష్యత్ శాస్త్రీయ పరిశోధనలకు ఎంతో దోహదపడనున్నాయి.
మైక్రోగ్రావిటీ పరిస్థితులు, క్లిష్టమైన ప్రయోగాల మధ్య కూడా శుభాంశు శుక్లా అపార ధైర్యంతో అన్ని బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. కఠిన పరిస్థితుల్లోనూ ప్రశాంతతను కోల్పోకుండా మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) కీలక పాత్ర పోషించారు.
భారత అంతరిక్ష చరిత్రలో వింగ్ కమాండర్ రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షానికి వెళ్లిన రెండో భారతీయుడిగా శుభాంశు శుక్లా గుర్తింపు పొందారు. ఈ మిషన్ ద్వారా భారత్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు లభించింది.
శుభాంశు శుక్లా చూపిన సాహసం, నాయకత్వ లక్షణాలు, అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అశోక్ చక్ర పురస్కారం అందుకుంటే, ఆయన దేశానికి గర్వకారణంగా నిలవనున్నారు.
Read Also: ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నారా..? రేపు కష్టమే
Follow Us On: Sharechat


