కలం, వెబ్‌డెస్క్: కివీస్‌తో రెండో టీ20లో ఇండియా సూపర్ విన్ సాధించింది. గెలుస్తుందా లేదా అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ అద్భుత విజయం సాధించింది. ఇషాన్ కిషన్ (76; 32 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లు), కెప్టెన్ సూర్యకుమార్ (Surya kumar Yadav) యాదవ్ (82 నాటౌట్; 37 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ అర్ధసెంచరీలతో చెలరేగడంతో రెండో టీ20లో 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాయ్‌పూర్ వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 208 పరుగులు చేసింది. మిచెల్ శాంట్నర్(47 నాటౌట్; 27 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర(44; 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో చైనామన్ బౌలర్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీయగా, శివం దూబె, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, హార్థిక్ పాండ్యా తలో వికెట్ పడగొట్టారు.
ఛేదనలో మొదట భారత్ తడబడింది. 6 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయింది. సూపర్ ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ(0) డకౌట్ కాగా, సంజూ శాంసన్ (6) సైతం వెంటనే వెనుదిరిగాడు. ఆరంభంలో పరిస్థితి చూస్తే భారత్ గెలుపు కష్టమే అని అనిపించింది. కానీ, సూర్యకుమార్ తోడుగా ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 21 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే, మరింత ధాటిగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 128 వద్ద మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత సూర్యకు శివమ్ దూబె జత కలిశాడు.
ఇషాన్ అవుటయ్యాక బాదుడు బాధ్యత తీసుకున్న స్కై (Surya kumar Yadav).. సిక్స్‌లు, ఫోర్లతో వీరవిహారం చేశాడు. 23 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. దూబె సైతం చేయి వేయడంతో భారత్ మరో 28 బంతులు ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. భారత బ్యాట్స్మెన్ల ధాటికి ప్రత్యర్థి బౌలర్ జాక్ ఫోక్స్ మూడు ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 67 పరుగులు సమర్పించుకున్నాడు. మూడో టీ20 గౌహతి వేదికగా ఈ నెల 25న జరుగుతుంది


