కలం, సూర్యాపేట : సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ ను ప్రజలందరూ సేదతీరే విధంగా, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రతిబింబించే విధంగా అభివృద్ధి చేస్తానని రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి (Patel Ramesh Reddy) అన్నారు. గురువారం ఆయన మినీ ట్యాంక్ బండ్ వద్ద పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేశ్ రెడ్డి మాట్లాడుతూ.. సూర్యాపేటను ఒక ప్రత్యేక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతోనే నిధులు మంజూరు చేశామన్నారు.
రూ.5 కోట్లతో మినీ ట్యాంక్ బండ్ సుందరీకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనులను ఆరు నెలల లోపు పూర్తిచేసి, ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా క్యాంటీన్, వాకింగ్ ట్రాక్, లైటింగ్, విశ్రాంతి ప్రదేశాలు వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా, తాను చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రత్యేకంగా కోటి రూపాయల అంచనా వ్యయంతో 80 సీట్ల ఏసీ బోట్‌ను మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ బోట్ నిర్మాణ పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయని, నెలలోపు పూర్తిచేసి పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా ప్రారంభిస్తామని పటేల్ రమేశ్ రెడ్డి (Patel Ramesh Reddy) వెల్లడించారు. సద్దుల చెరువు పరిసర ప్రాంతంలోని సుమారు 5 ఎకరాల పార్క్ స్థలంలో రూ.15 కోట్లతో ఒక అంతర్జాతీయ పార్క్ అభివృద్ధికి నిధులు మంజూరు అయినట్లు తెలిపారు. ఈ పార్క్‌కు త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పెద్దిరెడ్డి రాజా, ముదిరెడ్డి రమణారెడ్డి, డాక్టర్ వూర రామ్మూర్తి యాదవ్, వెలుగు వెంకన్న, ఫరూక్, దొంతిరెడ్డి సైదిరెడ్డి, ధర్మానాయక్, పర్యావరణ శాఖ అధికారులు పాల్గొన్నారు.


