కలం, వెబ్ డెస్క్: దావోస్ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రానున్నాయి. ప్రముఖ రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ RMZ గ్రూప్ 10 బిలియన్ డాలర్ల ప్రాజెక్టులను రాష్ట్రంలో చేపట్టనున్నట్టు తెలుస్తోంది. RMZ గ్రూప్, ఐటీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. విశాఖ నగర శివార్లలోని కాపులుప్పాడలో 50 ఎకరాలలోRMZ గ్రూప్ GCC (గ్లోబల్ క్యాపబులిటీ సెంటర్) పార్క్ ఏర్పాటు చేయబోతున్నట్టు సమాచారం. అంతేకాకుండా, విశాఖలో 500–700 ఎకరాల్లో హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ స్థాపనకు ఒప్పందం కుదిరింది.
అలాగే రాయలసీమలోని టేకులోడు ప్రాంతంలో దాదాపు 1000 ఎకరాల్లో ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు చేశారు. ఈ ప్రాజెక్టుల ద్వారా రాష్ట్రంలో సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నట్టు తెలుస్తోంది. పెట్టుబడులే లక్ష్యంగా ఐటీ మంత్రి లోకేశ్ దావోస్ పర్యటన కొనసాగుతోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.
పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశాలు
ఇదే సమయంలో ఏపీ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు సైతం పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. ఎన్‌విడియా గ్లోబల్ ఏఐ ఇనిషియేటివ్స్ ఉపాధ్యక్షురాలు కలిస్టా రెడ్మెండ్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సమావేశంలో, రాష్ట్రంలో ఏఐ ఎకోసిస్టమ్ను ఏర్పాటుచేసి, స్టార్టప్‌లను ప్రోత్సహించడం, యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై చర్చ జరిగింది. అమరావతిలో దేశంలోనే తొలి ఆర్టిఫీషియల్ యూనివర్సిటీ ఏర్పాటు, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్, హార్డ్‌వేర్ తయారీ యూనిట్, అలాగే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వంటి అంశాలపై కూడా చర్చలు జరిగాయి.

Read Also: మళ్లీ పాదయాత్ర.. జగన్ కీలక ప్రకటన
Follow Us On: Instagram


