కలం డెస్క్ : Revanth Reddy – KTR | రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లీడర్ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరితో మరొకరు పోటీ పడి తిట్టుకుంటున్నారు. సంస్కారంతో ప్రవర్తించాల్సిన ప్రజాప్రతినిధులు రోడ్కెక్కుతున్నారు. ‘అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్’ అంటూ అసెంబ్లీలో గొంతెత్తే ఈ నేతలు బహిరంగసభల్లో, మీడియా సమావేశాల్లో మైక్ ముందు బూతులు తిట్టుకుంటున్నారు. బూతుల్లో ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. చివరకు కుటుంబంలోని మహిళలను సైతం రాజకీయాల్లోకి లాగుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈ బూతు మాటలే రెండు రోజులుగా రాష్ట్ర ప్రజల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సవాళ్ళతో మొదలై వ్యక్తిగతమైన ఆరోపణలు చేసుకుంటూ ఒకరి తప్పులు, నేర చరిత్రను మరొకరు బహిరంగం చేస్తున్నారు. ఏకవచనంలో తిట్టకోవడమే కాక వాడు, వీడు, హౌల పోరడు.. ఇలాంటివి రొటీన్ పదాలుగా మారిపోయాయి.
ఫ్యామిలీ మహిళలపైనా విమర్శలు :
ఆస్తి పంచివ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో సొంత చెల్లిలినే పార్టీ నుంచి బైటకు గెంటేశావంటూ కేటీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి తప్పుపట్టారు. సొంత చెల్లిలి భర్త ఫోన్‌ను ట్యాపింగ్ చేశారంటూ వాళ్ళింటి (కేటీఆర్) ఆడబిడ్డనే చెబుతోంది.. సొంత చెల్లెలికి సమాధానం చెప్పలేని కేటీఆర్ నాకు సవాల్ విసురుతున్నాడు.. అని కామెంట్ చేశారు. దీనికి కౌంటర్‌గా కేటీఆర్ సైతం సీఎం రేవంత్‌రెడ్డి భార్య గీత పేరును ప్రస్తావించారు. కొన్ని రోజులుగా ఒర్లుతున్నాడని, ఇక కరుస్తాడేమోననే భయం ఉన్నదని, ఆయనను కట్టిపడేయాలని గీతకు కేటీఆర్ హితవు పలికారు. రాజకీయాల్లోకి కుటుంబాల్లోని మహిళలను లాగడం చర్చకు దారితీసింది. ఒకరు ముఖ్యమంత్రిగా, మరొకరు మాజీ మంత్రిగా తగిన చైతన్యం ఉన్నా అదుపు తప్పి వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పరస్పరం సవాళ్ళు, శపథాలు :
మూడేండ్ల తర్వాత (2029లో) 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగితే 87 సీట్లతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా… డీలిమిటేషన్ జరిగి 153 నియోజకవర్గాలైతే 100 కంటే ఎక్కువ స్థానాలతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తా.. చేతనైతే కాస్కో బిడ్డా.. అంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ సవాల్ విసిరారు. “నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. కేసీఆర్‌కు అధికారం ఇక కల్లనే.. బీఆర్ఎస్, కేసీఆర్ చరిత్ర ఇక ఖతమే… కొడంగల్ సాక్షిగా ఇదే నా శపథం…” అంటూ నొక్కిచెప్పారు. దీనికి కౌంటర్‌గా కేటీఆర్… “రేవంతూ (Revanth Reddy – KTR)… నిన్ను కొడంగల్‌లో ఓడగొట్టి అసెంబ్లీకి రాకుండా చేస్తా.. ఆ బాధ్యతను మా పార్టీ, కార్యకర్తలు చూసుకుంటరు.. నేను ఆంధ్రలో చదువుకుంటే తప్పంట.. వీడు (సీఎం రేవంత్‌ను ఉద్దేశించి) మాత్రం ఆంధ్ర నుంచి అల్లుడిని తెచ్చుకోవచ్చంట..” అని వ్యాఖ్యానించారు. వీరిద్దరి మధ్య ఇలాంటి మాటలు తూటాల్లా పేలుతున్నాయి.
Read Also: కన్నీళ్లు పెట్టిస్తున్న మావోయిస్టు అగ్రనేత లేఖ.. మరణాంతరం వెలుగులోకి
Follow Us On: X(Twitter)


