epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

కన్నీళ్లు పెట్టిస్తున్న మావోయిస్టు అగ్రనేత లేఖ.. మరణాంతరం వెలుగులోకి

కలం, వెబ్‌డెస్క్: కన్న తల్లికి ఓ మావోయిస్టు నేత రాసిన లేఖ అతడి మరణాంతరం వెలుగులోకి వచ్చింది. తండ్రి చనిపోయినా ఆ నేత అడవి వీడి రాలేకపోయాడు. అప్పటి పరిస్థితిని.. తన చిన్ననాటి అనుభవాలను ఆ లేఖలో పంచుకున్నారు. ఇటీవల పోలీస్ ఎన్‌కౌంటర్‌లో గణేశ్ (Maoist leader Ganesh) అలియాస్ పాక హనుమంతు చనిపోయిన విషయం తెలిసిందే. ఒడిశాలోని కాంథమాల్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు కాల్పుల్లో చనిపోయాడు. అయితే ఆయన 2022 సెప్టెంబర్ లో రాసిన ఓ లేఖ ఇప్పుడు బయటకు వచ్చింది.  గణేశ్ తండ్రి 2022లో చనిపోయాడు. ఆ సమయంలో గణేశ్ తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేదు. తండ్రి మరణాంతరం తల్లి కూడా దుర్బర జీవితాన్ని గడిపి చివరకు ఆమె కూడా కన్ను మూసింది. అప్పుడు కూడా గణేశ్ రాలేదు. కానీ ఓ లేఖను తన కన్నవాళ్లను గుర్తు చేసుకుంటూ రాశాడు. ఆ లేఖ వారికి చేరిందో లేదో తెలియదు.. కానీ ఇప్పుడు ఈ లేఖ బయట పడింది.

అమ్మా.. ఆ నాటి రోజులు యాదికొస్తున్నాయి

‘అమ్మా.. ఇంతటి విషాద సమయం వస్తుందనుకోలేదు. 90 సంవత్సరాల వయసులో నాన్న సెప్టెంబర్‌ 30, 2022న మనల్ని వదిలి వెళ్లిపోయాడనే సమాచారాన్ని పేపర్లో చూశాను. నాన్న మరణ వార్తతో నాకు నాలుగు దశాబ్దాల కిందటి విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. నాన్న నా కోసం, నా తోబుట్టువుల కోసం, మన ఇంటి కోసం ఎంతో కష్టపడ్డాడు. చిన్నప్పుడు మా తాత పుల్లయ్య, నాయనమ్మ పెద్దమ్మ ఒడిలో ఆటలాడుకున్న రోజులు గుర్తొస్తున్నాయి. నాన్న మోటగొట్టి, పొలం, చెలక దున్ని, పెంటకొట్టివిత్తనాలు వేసి పంటలు పండించేవాడు కదా. ఆయన చేసిన కష్టమంతా నీదే. మీ ఇద్దరు కడు బీదతనంతో మమ్మల్ని సాదడానికి అప్పులు చేసి ఎన్ని కష్టాలు పడ్డారో కదా. అంత శ్రమ చేసినా ఆ రోజుల్లో మన కుటుంబమంతా పస్తులు వున్న రోజులూ ఉన్నాయి. ఈ దేశంలో మన లాంటి ఎన్నో కుటుంబాలు అట్లా బతుకుతున్నవే. ‘ అంటూ తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నాడు హనుమంతు. మన ఊరు నుండి నల్లగొండ టౌన్‌కు వెళ్లడానికి బస్‌ కిరాయికి కూడా డబ్బులు లేకపోతే నీవు రెండు రోజులు నాట్ల కూలికి పొయ్యి తెచ్చి ఇచ్చిన డబ్బులతో నేను బయల్దేరాను. నేను పై చదువులు చదివి ఏదైనా కొలువు చేసి కుటుంబాన్ని సాదుతానని మీరు అందరు అమ్మనాన్నల్లాగే అనుకున్నారు.‘ అంటూ గణేశ్ (Maoist leader Ganesh) లేఖలో ప్రస్తావించారు. 

తాత ఇచ్చిన స్ఫూర్తితో

తాత పుల్లయ్య నల్లగొండ జిల్లాలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న అనుభవాలను చెప్పేవాడు. ఆ రోజుల్లో గ్రామాల్లో కొనసాగుతున్న దొరల దౌర్జన్యాలను, దోపిడి పీడనలను, వెట్టిచాకిరీని ఆయన కళ్ళకుకట్టినట్టుగా చెప్పేవాడు కదా. ఆనాడు కమ్యూనిస్టు గెరిల్లాలను అణచడానికి నైజాం పోలీసు బలగాలు, రజాకార్ల దాడులు, నెహ్రూ, పటేల్‌ నాయకత్వంలోని భారత సైన్యం నల్లగొండ జిల్లాను ఎట్లా చుట్టుముట్టినవో చెప్పేవాడు.  మన పల్లెల్లో తాతలాగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న అనుభవం ఉన్న పెద్దలు ఎంతో మంది ఉన్నారని నాకు కాస్త పెద్దయ్యాక తెలిసింది. అట్లాగే ఆనాటి విప్లవ వారసత్వాన్ని, వేలాది మంది అమరుల త్యాగాలనూ ఎత్తి పడుతూ నక్సల్బరి, శ్రీకాకుళ పోరాట యోధులు కొనసాగుతున్నారని తెలుసుకున్నాను. అంతగా తాత తన పోరాట అనుభవాలతో నా మీద చెరగని ముద్ర వేశాడు. ఆయన మాటల వల్ల నా యవ్వన కాలంలో నేను సమాజంలో జరుగుతున్న దోపిడి, అసమానతల గురించి సీరియస్‌గా ఆలోచించే అవకాశం కలిగింది. విప్లవ రాజకీయాలతో ప్రభావితమై రాడికల్‌ విద్యార్థి సంఘంలో సభ్యుడిగా చేరి జిల్లా కమిటీలో వుంటూ పనిచేశాను. 1981లో కాలేజీలో డిగ్రీ చదువుతూ కాలేజీ చదువులను మధ్యలో వదిలేసి విప్లవోద్యమంలోకి వెళ్లాను.

ఇబ్బంది పెట్టినా నా కోసం నిలబడ్డారా?

ఈ నలభై ఏళ్లలో పోలీసు బలగాలు అనేకసార్లు మన యింటిపై దాడులు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్లు నేను తెలుసుకున్నాను. ముఖ్యంగా నాన్నను చండూర్‌ పోలీసు స్టేషన్‌ తీసుకెళ్లి నా ఆచూకి కోసం అవమానపరుస్తూ హింసించారు. నన్ను లొంగిపొమ్మని పత్రికా ముఖంగా ప్రకటించాలని నాన్నను ఎన్నోసార్లు వేధించినప్పటికీ ఆయన తలవంచలేదు. ఒక విషయంలో స్పష్టత ఉంటే ఎన్ని కష్టాలు వచ్చినా దాని కోసం నిలబడి ఉండాలనే విలువను ఆయన తన సొంత జీవితంలో పాటించాడు. అలాంటి ఆలోచనలతోనే నాన్న తన తుది శ్వాస వదిలి ఉంటాడని నేను ఊహించగలను.

దోపిడీ రాజ్యం నిర్బంధించింది

ఈ రోజు అనేక మంది విప్లవకారులు తమ ప్రియమైన తల్లిదండ్రులను తోడబుట్టిన వాళ్లను తలచుకోవడమే తప్ప కలుసుకోలేని విధంగా దోపిడీ రాజ్యం నిర్బంధం విధించింది. పట్టణ ప్రాంతాల్లో ప్రజాస్వామిక, అభ్యుదయ, విప్లవ ప్రజాసంఘాల నాయకులపై మేధావులపై, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అణచివేత ప్రయోగిస్తున్నది. విప్లవకారులు అమరులైనప్పుడూ, వాళ్ల రక్త సంబంధీకులు చనిపోయినప్పుడూ ఎందరో ప్రజలు, ప్రజాసంఘాల సభ్యులు కలిసి అంతిమ వీడ్కోలు పలికే సంప్రదాయం చాలా ఏళ్లుగా కొనసాగుతున్నది. నాన్నను కూడా అట్లే గౌరవంగా సాగనంపారని తెలిసి ఈ విషాదంలో కూడా సంతోషం కలిగింది. వాళ్లందరికీ విప్లవాభివందనాలు తెలియజేస్తున్నాను. ఉంటాను.‘ అంటూ ఆయన లేఖను ముగించారు.

Read Also: స్టూడెంట్ చేసిన పనికి రోహిత్ శర్మ ఎమోషనల్..

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>