కలం, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కష్టాలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగుల తేడాతో ఓడిపోయిన రుతురాజ్ గైక్వాడ్ సేన, ఈ సీజన్‌లో వరుసగా మూడో పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో చెన్నై పాయింట్ల పట్టికలో చివరి స్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలో జట్టు అనుసరిస్తున్న పేలవమైన వ్యూహాలపై టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
బౌలింగ్‌లో ఆర్‌సీబీ విధ్వంసం
మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముఖ్యంగా ఆఖరి 5 ఓవర్లలో చెన్నై బౌలర్లు ఖలీల్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, జేమీ ఓవర్టన్‌లపై ఆర్‌సీబీ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. చివరి 30 బంతుల్లోనే ఏకంగా 11 సిక్సర్లు బాది మ్యాచ్‌ను మలుపు తిప్పారు. 15 ఓవర్లకు 153 పరుగులుగా ఉన్న స్కోరును అమాంతం 250కి చేర్చారు.
జేమీ ఓవర్టన్‌ను ఉపయోగించిన తీరుపై అశ్విన్ (Ravichandran Ashwin) మండిపడ్డారు. ఓవర్టన్ తన మొదటి రెండు ఓవర్లలో కేవలం 12 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీసినా, డెత్ ఓవర్లలో అతడితో వైడ్ యార్కర్లు వేయించాలన్న ప్రణాళికను అశ్విన్ తప్పుబట్టారు. ఓవర్టన్ బలం హార్డ్ లెంగ్త్ బంతులు వేయడమని, అతడి బలహీనత అయిన యార్కర్లను వేయమని అడగడం ఏంటని ప్రశ్నించారు. ఇది పదో తరగతి పిల్లాడిని ఫోరియర్ సిరీస్ లెక్కలు అడిగినట్లు ఉందని ఆయన ఎద్దేవా చేశారు. పతిరానా లేకపోవడం, ఎల్లిస్ గాయపడటం జట్టు డెత్ బౌలింగ్‌ను దెబ్బతీసిందని ఆయన అభిప్రాయపడ్డారు.
Read Also: శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్
Follow Us On: Instagram

