కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఉన్నాతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలనా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేలా ‘డిజిటల్ గవర్నెన్స్’ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన చట్టాలను రూపొందించాలని అధికారుల్ని సీఎం ఆదేశించారు.
ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందేలా చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దీనికోసం ఉద్యోగుల వివరాలు, వారి బ్యాంక్ ఖాతాలను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేసినప్పటికీ, ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించకుండా వేధించే కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.
మరోవైపు పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేయడం ద్వారా ఉద్యోగులతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ఎలాంటి అవినీతి లేకుండా నేరుగా లబ్ధిదారులకు చేరేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చారు. డిజిటల్ గవర్నెన్స్ పై పూర్తిస్థాయి కసరత్తు చేసేందుకు ఒక కమిటీని నియమించాలని ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ కమిటీ రాబోయే 100 రోజుల్లోగా నివేదిక సమర్పించి, ఈ ప్రక్రియను ఓ కొలిక్కి తీసుకురావాలని ఉన్నతాధికారులకు గడువు విధించారు.
Read Also: తుంగతుర్తి కాంగ్రెస్‌లో ఒరిజనల్ vs వలసలు!
Follow Us On: X(Twitter)

